ప్రజా సమస్యలపై జనసేన పాదయాత్ర

  • ఈ నెల 10న కోడూరు నుంచి చిట్వేలికి
  • దశాబ్దాలుగా పెండింగులో ఉన్న సమస్యలే ఆయుధం
  • అధికారానికి డోకా లేదనుకునే వారికి భయంతోనే పవన్ పై రెక్కీలు
  • జనసేన రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు , దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ప్రజల సమస్యలపై ఈనెల 10వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. గురువారం చిట్వేలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా చిట్వేలి కోడూరు రోడ్డు ఎన్నికల హామీగానే మిగులుతుందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా చిట్వేలి కోడూరు రోడ్డును విస్తరించలేకపోవడం విచారకరమన్నారు. గత ఎన్నికల్లో ఈ రోడ్డును ప్రధాన హామీగా ప్రజలకు గుప్పించారని, హామీని నెరవేర్చకుండా అబద్ధపు కబుర్లతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ రోడ్డుపై ఎమ్మెల్యేని ఎప్పుడు ప్రశ్నించినా ఒక పేపర్ చూపిస్తారని అందులో ఏమున్నదో ఎవరికి అర్థం కాలేదని అన్నారు. ఎందుకు ఇంతవరకు ఆ రోడ్డును విస్తరించలేదు తెలపాలని సూటిగా ప్రశ్నించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా చిట్వేలి కోడూరు రోడ్డు మారిందన్నారు. మాదాసు నరసింహ మాట్లాడుతూ రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందన్నారు. ఐదు ఎకరాలు అరటి సాగు చేసిన రైతు పంట నష్టం జరిగితే ఎకరాకు 800 రూపాయలు మాత్రమే పరిహారంగా వస్తుందని చెప్పడం దారుణంగా ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులను అడిగితే వరి మినహా ఏ ఉద్యానవన పంటలేసినా పరిహారం అంతగా రాదని చెప్పారన్నారు. ఈ విషయాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియవా అని ప్రశ్నించారు.

  • 10న పాదయాత్ర.. పేర్లు నమోదు చేసుకోండి

ఈనెల 10వ తేదీన చిట్వేలి కోడూరు రోడ్డుపై ప్రజల మద్దతుతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని, యాత్రలో పాల్గొనదలచిన వారు పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని నాగేంద్ర పిలుపునిచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో జనసేన బాధ్యులు పేర్లను రిజిస్టర్ చేసుకుంటారని చెప్పారు. ఏడవ తేదీ వరకు స్టేషన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుందన్నారు. పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రజా పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అయితే మిగిలిన ఐదు శాతంలో పేలి కోడూరు రోడ్డు ఉందా అని ఆయన ప్రశ్నించారు. వీలైనంత త్వరలో జనసేన పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాదాసు నరసింహ, పగడాల వెంకటేష్, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ, దాసరి వీరేంద్ర, షేక్ రియాజ్, మాదాసు శివ, ఆనందలతేజ, కడుమూరి నాగరాజు, తిరుమలశెట్టి హరి, సువారపు హరి ప్రసాద్, కొత్తపల్లి రవి, మాదినేని హరి, పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు.