తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ “జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డపై పార్టీని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి రానున్న ఎన్నికల్లో దాదాపు 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. పార్టీ క్యాడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీలు వేశాం, అక్కడ పార్టీ బలంగా పనిచేస్తుంది. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పోటీ చేయడానికి నిర్ణయించాం. జీహెచ్ఎంసి పరిధిలో, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేయనుంది.తెలంగాణ రాష్ట్రంలో పొత్తుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాం, పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఇక్కడ కూడా చేయనున్నారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేశాం, దాదాపు 25 స్థానాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో మా ఓటింగ్ ఉంది. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ సానుభూతిపరులు, మెగా అభిమానులు పార్టీకి అండగా నిలబడతారు. గత 10 సంవత్సరాల్లో పలు సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ పోరాటం చేసింది. నల్లమల యురేనియం తవ్వకాలపై చర్చాగోష్టి నిర్వహించాం. మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై పోరాటం చేశాం” అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు శ్రీ తాళ్లూరి రామ్ , శ్రీ రాధారం రాజలింగం, శ్రీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.