పెంచిన విద్యుత్తు ఛార్జీలపై భగ్గుమన్న జనసేన

*అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనల హోరు
వైసీపీ ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. మాట తప్పం మడమ తిప్పం అన్న ముఖ్యమంత్రి, మూడేళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీల రూపంలో ఏడు సార్లు ప్రజల మీద భారం మోపారంటూ మండి పడ్డాయి. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంభిస్తున్న తీరుని ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వివిధ జిల్లాల ఇంఛార్జులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉత్తరాంధ్ర జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు దిగాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాయి. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. పేదవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు అంటూ నినదించాయి.
విసనకర్రలతో వినూత్న నిరసన
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ రణరంగంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి విద్యుత్ ఛార్జీలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించాయి. విజయవాడలో శ్రీ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టారు. చేతిలో విసన కర్రలతో నిరసన తెలిపారు. అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. జనసేన నాయకులను కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవాలని చూసినా… జిల్లా నాయకులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
లాంతర్లతో ప్రదర్శన
పెరిగిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో భారీగా జనసేన శ్రేణులు రోడెక్కాయి. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచిందని సింబాలిక్ గా చెప్పడానికి లాంతర్లతో నిరసన తెలిపారు. అనంతరం అద్దంకి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లిన శ్రేణులు ఏ. ఓ. గారికి వినతిపత్రం సమర్పించాయి. కరోనా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలపై ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ భారంతో పాటు ట్రూ అప్ చార్జీల కింద మరో రూ.3 వేల కోట్ల రూపాయల భారం వేయటం దారుణమని నెల్లూరు జిల్లా జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించాయి.
అరెస్టులు… నిర్బంధాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాయలసీమ జనసేన శ్రేణులు భారీగా రోడ్డెక్కాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాకు దిగాయి. అనంతపురంలో వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జనసేన నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నాయకులను పోలీసులు అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ప్రజలపై రూ. 1400 కోట్లు భారం మోపడం ఏంటని చిత్తూరు జిల్లా జనసేన శ్రేణులు మండిపడ్డాయి. ఉగాది కానుకగా ముఖ్యమంత్రి ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ ఇచ్చారన్నాయి. కడప జిల్లాలో సయ్యద్ ముకరం చాంద్ భాష ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి. కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశాయి. కలెక్టర్ ను కలిసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం సమర్పించాయి. కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా నిరసనలు హోరెత్తాయి.