అధికారమే లక్ష్యంగా పాదయాత్రలో అందరికీ హామీలిచ్చారు

• అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్ని విస్మరించారు
• నవరత్నాలు ఇచ్చేశామంటున్నారు.. లక్షలాది మంది సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు
• ప్రతి జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు హామీలు ఇచ్చారు
• ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తానన్నారు.. మధ్యవర్తుల్ని తీసేస్తానన్నారు..
• సీపీఎస్ రద్దులా ఇచ్చిన హామీని మరిచిపోయారు
• విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది
• ఇచ్చిన హామీ నిలబెట్టుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది
• హామీ అమలు చేయకుంటే.. తదుపరి జనసేన ఆ బాధ్యత తీసుకుంటుంది
• జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులతో పవన్ కళ్యాణ్

పాదయాత్రలో ఈ ముఖ్యమంత్రి ఓట్ల కోసం నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేశారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విమర్శించారు. పాదయాత్ర సమయంలో అన్ని జిల్లాల్లో విద్యుత్ ఒప్పంద ఉద్యోగులకు నేనున్నాను.. నేను విన్నాను అంటూ హమీలు ఇచ్చి మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దులా ఈ హామీనీ మర్చిపోయారని తెలిపారు. నవరత్నాలు ఇచ్చేశామని చెబుతున్న మీరు లక్ష మంది ప్రజల సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రెండో విడత జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వారి సమస్యలపై అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ…
• ప్రభుత్వాలు మారినప్పుడల్లా మధ్యవర్తులు మారిపోతున్నారు
మొదటి విడత జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ దృష్టికి 427 పిటిషన్లు వచ్చాయి. 427 పిటిషన్లు అంటే 427 మంది సమస్య కాదు.. కొన్ని వేల మందికి సంబంధించిన సమస్యలు. ఈ రోజు ఏపీ కరెంటు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వారు …. ప్రభుత్వం విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా ఈ ఔట్ సోర్సింగ్ విధానం ప్రారంభమయ్యింది. గతంలో ఇళ్లలో మీటర్లు చూసే వారికి, విద్యుత్ వైర్లు వేసే వారికి ప్రభుత్వం నుంచి జీతాలు వచ్చేవి. ఇప్పుడు వారిని కాంట్రాక్టు పద్దతిన తీసుకుంటున్నారు. ప్రస్తుతం 23 వేల మందికి పైగా ఇలాంటి సిబ్బంది పని చేస్తున్నారు. వారికి మధ్యవర్తి ద్వారా జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ మధ్యవర్తులు మారిపోతూ ఉంటారు. వీరంతా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు కావడమే అందుకు కారణం. మధ్యవర్తులు మారిపోతున్నా 20 ఏళ్లుగా కాంట్రాక్టు సిబ్బందిగా వారే విధులు నిర్వహిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన వీరిని గుర్తించాలన్న డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది.
• తెలంగాణలో చేసినప్పుడు అసంబద్ద కోరిక ఎలా అవుతుంది?
ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేసినప్పుడు ఎవరు ఏది అడిగితే వారికి ఆ పని చేసేస్తానని హామీలు ఇచ్చారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మా ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి.. మధ్యవర్తుల్ని తీసేయండి అంటే నడక సందర్భంలో మాటిచ్చేశారు. అన్న ఉన్నాడు.. విన్నాడు.. మాట నిలబెట్టుకుంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన మాట మరిచారు. ఇది అసంబద్దమైన కోరిక ఏమీ కాదు. తెలంగాణలో మధ్యవర్తుల్ని తీసేస్తే అక్కడ క్వాలిఫైడ్ ఉద్యోగులకు రూ. 33,858 జీతం వస్తోంది. ఇక్కడ రూ. 11 వేల చిల్లర తక్కువ వస్తోంది. పెరిగిన ధరలతో పాటు జీతాలు పెరగకుంటే వీరంతా ఎలా బతకాలి. నవరత్నాలు ఇచ్చేశామని చెబుతున్నారు. అధికారం లక్ష్యంగా ఉండే పథకాలు ముందుకు తీసుకువెళ్తూ సమస్యలు గాలికి వదిలేశారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య పరిష్కారానికి జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. జనసేన నాయకులంతా ఈ సమస్య మీద మాట్లాడుతారు. ఒక వేళ సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి వచ్చే ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కరించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది అని అన్నారు.
• రెండో విడత జనవాణి – జనసేన ప్రారంభం
అందరికీ ఏకాదశి, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.. పొలిటికల్ పార్టీగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాం.. వ్యక్తిగతం గా మీరు ఇచ్చే అర్జీలు సంబంధిత శాఖకు మా తరఫున తక్షణ స్పందన కోసం పంపుతాం. సీఎం ఆర్ ఎఫ్ నుంచి ఆరోగ్యశ్రీ అమలు చేయని కేసులు వచ్చాయి. ఈ కార్యక్రమం ముఖ్యమైన అంశం.. ప్రభుత్వం తీర్చాల్సిన సమస్యలు తీర్చకపోవడం వల్ల ముందుకు తీసుకు వెళ్తున్నాం. మాకు అంత నిధలు ఉంటే అందరికీ సహాయం చేయాలని ఉంది. పరిమితమైన నిధుల వల్ల చేయలేక పోవచ్చు.. సాధ్యమైనంత వరకు సాయం చేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.