ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 80 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన జనసేనాని

రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోంది. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని, ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందచేస్తుందని, ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నాం. త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తాను. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. మనం ఈరోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు… పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరు. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.