కూతలేరు వంక వంతెన సమస్యపై జనసేన పోరాటం

  • కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా నాయకత్వానికి సూచించిన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

అనంతపురం జిల్లా శింగనమల నియోజక వర్గంలోని కూతలేరు వంక వంతెన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అందుకోసం తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ అనంతపురం జిల్లా నాయకత్వానికి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం అనంతపురంలో శ్రీ మనోహర్ గారిని శింగనమల నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీమతి రాయదుర్గం తేజ లక్ష్మీ, శ్రీ గంజికుంట రామకృష్ణ అధ్వర్యంలోని బృందం కలిసి ఈ వంతెన సమస్యను వివరించారు. నార్పల వద్ద కూతలేరు వంక వున్న వంతెనను రెండేళ్ల క్రితం కూల్చి వేశారు. ఆ వంతెన నిర్మాణం కోసం స్థానిక ప్రజలతో కలసి జనసేన శ్రేణులు పోరాటం చేస్తున్నాయి. ఈ వంతెన నాలుగు మండలాల ప్రజలకు ఉపయోగపడుతుందనీ, గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. అన్నారు. జనసేన నాయకులు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నాలుగు మండలాలు, 36 గ్రామాల ప్రజలకు ఆ వంతెన మార్గమే ప్రధాన రహదారి అని, వంతెన కట్టకపోతే కనీసం మట్టికట్ట అయినా వేయాలని ప్రజలు ప్రాధేయపడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్న విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వంతెన నిర్మాణం జరిగే వరకు జనసేన పార్టీ పక్షాన ఒక ప్రణాళికాబద్దంగా పోరాటం చేద్దామన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, జిల్లా నాయకులు శ్రీ జయరామ్ రెడ్డి, శ్రీ మురళీకృష్ణ, శ్రీ ఈశ్వరయ్య, శ్రీ పెండ్యాల హరి, శ్రీ సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.