జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం

* పెన్షన్ డబ్బుల నుంచి రూ. లక్షన్నర అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ మాతృమూర్తి శ్రీమతి అంజనాదేవి
* పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తండ్రి శ్రీ కొణిదెల వెంకట్రావు గారి జయంతి సందర్భంగా తల్లి శ్రీమతి అంజనాదేవి గారు… పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ. లక్షన్నర విరాళం అందచేశారు. పార్టీకి రూ. లక్ష విరాళం ఇచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీమతి అంజనాదేవి గారు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా తండ్రి గారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. పెన్షన్ డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి అమ్మ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అబ్కారీ శాఖలో పనిచేసేవారు. ఆయనకు వచ్చిన జీతంతోనే మేమంతా పెరిగాం. 2007లో ఆయన కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ రావడం మొదలయ్యింది. పెన్షన్ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి విరాళంగా ఇచ్చింది. పెద్ద మనసుతో ఆమె చేసిన ఈ పనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
* పాత పెన్షన్ స్కీమ్ ఎందుకు కోరుతున్నాను అంటే…
సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని నేను ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాన”ని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం గారు పాల్గొన్నారు.