ఆత్మకూరు జాతీయ రహదారి దిగ్భందనం చేసిన జనసేన నాయకులు

చుక్కల భూములకు ఓటీఎస్ కల్పించండి
లక్షలాది రైతులను కాపాడండి
ప్రభుత్వ ఖజానాకు లక్ష కోట్లు చేరుతాయి

ఆత్మకూరు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట చుక్కల భూముల సమస్యల ఉద్యమ నాయకుడు, జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జిల్లాలోని వివిధ మండలాల నుండి రైతులతో కలిసి జాతీయ రహదారిని దిగ్భందనం చేశారు. దీంతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. జనసేన పార్టీ నుండి నెల్లూరు సిటీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కావలి ఇన్ ఛార్జ్ అలహరి సుధాకర్, సూళ్లూరుపేట ఇన్ ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు, మహిళా నాయకురాలు శిరీషారెడ్డి రైతులకు సంఘీభావంగా పాల్గొన్నారు. అరగంటకు పైగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని నాయకుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యని తీసుకెళ్తామని రైతులకు భరోసా కలిగించడంతో వారు నిరసన విరమించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చుక్కల భూముల సమస్యతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మొదలైన ఈ సమస్యని తెలంగాణ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించి రైతులకు అండగా నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వప్రయోజనాలను ఆశిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లా చుక్కల భూముల రైతుల సమస్య పరిష్కారం జరిగిందని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లా చుక్కల భూముల రైతుల సమస్య తీరిందని, రాష్ట్రవ్యాప్తంగా ఒక విధానం తీసుకొచ్చి ఎందుకు ఈ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక విధానాన్ని తీసుకొస్తే 24 లక్షల ఎకరాల భూమికి విముక్తి లభిస్తుందని, సుమారు కోటి మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

జనసేన పార్టీ నెల్లూరు సిటీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని గృహాల విషయంలో అవసరం ఉన్నా లేకుండా శాశ్వత గృహ హక్కు చట్టం అంటూ ఓటీఎస్ విధానం పెట్టి డబ్బులు సమకూర్చుకుంటూ ఉందన్నారు. కానీ నిజంగా అవసరం ఉన్న చుక్కల భూముల అంశంలో రైతులకు మేలు చేకూరే విధానం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అని అన్నారు. ప్రభుత్వానికి 50 మందికి పైగా సలహదారులున్నా ఎందుకు పనికిరాని వారుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. శాశ్వత పట్టాలు ఉండి, ఓటీఎస్ అవసరం లేని గృహాలకు ఓటీఎస్ పెట్టి 10వేల రూపాయలు ఒత్తిళ్ళు చేస్తూ ప్రజల నుండి కట్టించుకోవడం కాదని ఇక్కడ నిజంగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకు ఓటీఎస్ పెట్టి పరిష్కరించాలని సలహా ఇస్తున్నామని, ఈ సలహాని సీఎం జగన్ రెడ్డి గారు పాటించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. చుక్కల భూములకు ఓటీఎస్ పెడితే ప్రభుత్వానికి నెల రోజుల్లో లక్ష కోట్లు ఖజానాకు చేకూరుతాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం చుక్కల భూముల అంశాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి రైతులు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.