ముస్లిం నివాస ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు జనసేన ప్రాధాన్యం

* వ్యక్తులు చేసే తప్పుల్ని కులానికో మతానికో అంటగట్టడం సరికాదు
* జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
* ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు విరాళాలు అందించిన పవన్ కళ్యాణ్

కులాలు, మతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ది చెందుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యక్తులు చేసే తప్పులను కులానికో, మతానికో అంటగట్టడం సరికాదని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ, మంగళగిరి, అమరావతి ప్రాతాలకు చెందిన పలువురు ముస్లింలు ఆదివారం ఉపవాస దీక్ష విరమణ అనంతరం పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో కలిశారు. వారికి పండ్లు, పానీయాలు అందచేశారు. ప్రతి ఏకాదశికి సాయం సంధ్య వేళ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం చైత్ర మాసం, కృష్ణ పక్ష ఏకాదశి పూజలు అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముస్లిం సోదరులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఏ మతం, కులంలో పుట్టాలనే ఛాయిస్ మన చేతుల్లో లేదు. ఏ మతం, కులంలో పుట్టినా మానవత్వంతో జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు దృష్టిలో మనందరం సమానమే. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల, మతాలకు అతీతంగా పేదరికం పారదోలడం మీద దృష్టిపెడతాము. ముఖ్యంగా గుంటూరులో తీవ్ర లక్షణాలున్న డయేరియా వ్యాపించినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించాను. ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేవు. మేము అధికారంలోకి రాగానే ముందుగా ముస్లింలు నివసిస్తున్న ఏరియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రణాళిక ఉంది. అదే విధంగా వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడంతోపాటు, చక్కటి విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం ఉంది. వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయం నా దృష్టికి చేరింది. ముస్లింల కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకాలు అమలు కావడం లేదు. వీటన్నింటిపై జనసేన సమగ్ర చర్చ చేపడుతుంది” అన్నారు.
* ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలకు విరాళాలు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థనా స్థలాలకు రూ.25 లక్షల విరాళం అందించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడకు చెందిన దారుల్ ఉలుమ్ హలేమియా వెల్ ఫేర్ సొసైటీకి రూ.5 లక్షలు, అమరావతికి చెందిన జామియా అతీఖుర్ రహమాన్ లిల్ బనాత్ ఎడ్యుకేషన్ సొసైటీకి రూ.5 లక్షలు, మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో ఉన్న మసీద్ ఎ నూర్ కు రూ.5 లక్షలు విరాళం అందించారు. అలాగే కర్నూలు దర్గాకు, కడప మసీదుకు చెరో రూ. 5 లక్షల చొప్పున పార్టీ తరఫున విరాళం అందించే బాధ్యతను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ అర్హంఖాన్, పార్టీ ప్రతినిధి శ్రీ అబిద్ లకు అప్పగించారు.
* దౌర్జన్యం చేసేవాడిని నిలువరించాలి
అమరావతి నుంచి వచ్చిన శ్రీ షేక్ అబ్దుల్ మస్తాన్ వలి మహ్మద్ ప్రవక్త చెప్పిన ప్రవచనాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా చెప్పారు… “సమాజంలో దౌర్జన్యం చేసే వాడికి, గురయ్యేవాడికి సహాయం చేయమని ప్రవక్త చెప్పారు. దౌర్జన్యం చేసేవాడికి సాయం ఏమిటీ? అంటే అతని దౌర్జన్యాన్ని నిలువరించేలా చేయి పట్టుకోవడం కూడా అతనికి సాయమే. తద్వారా సమాజాన్ని కాపాడటమే నిజమైన మేలు. ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో దౌర్జన్యం చేసేవాడి చెయ్యిపట్టుకొని నిలువరించాలి. రాజ్యాన్ని పాలించే రాజు ముందు ధైర్యంగా నిలబడి నిజం మాట్లాడేవాడే అసలైన ధైర్యశాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ యూనస్, శ్రీ షబ్బీర్, శ్రీ అమీర్ బాషా, శ్రీ అజస్, శ్రీ ఇర్షాద్, శ్రీ షేక్ అబ్దుల్ మస్తాన్ వలి, శ్రీ షేక్ జాని, శ్రీ షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.