చెరువులను రక్షించుకోవాలని వినాయకునికి జనసేన వినతి

  • కొన్నాళ్ళకు వినాయక నిమజ్జనానికి కూడా చెరువులు ఉండని పరిస్థితి
  • కబ్జాకు గురవుతున్న కోట్లాది రూపాయల విలువైన చెరువులు
  • కబ్జాలు నియంత్రించి, ఆక్రమణలు తొలగించేలా అధికారులకు బుద్ధి ప్రసాదించాలి
  • విఘ్నేశ్వరునికి విన్నవించి వినతి పత్రం ఇచ్చిన ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు

పార్వతీపురం, విఘ్నేశా… చెరువులను రక్షించుకోవాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు కోరారు. బుధవారం పార్వతీపురం మున్సిపల్ మార్కెట్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, ఉపాధ్యక్షురాలు రేజేటి దయామణి, పార్వతీపురం పట్టణ అధ్యక్షులు సిగడం భాస్కరరావు, మండల ఉపాధ్యక్షులు అన్నాబత్తుల దుర్గాప్రసాద్ తదితరులు పార్వతీపురం మన్యం జిల్లాలో కబ్జా గురవుతున్న చెరువులను కాపాడుకోవాలని విన్నవిస్తూ వినతి పత్రాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో, జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు 15 మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ చెరువులు, స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే వినాయక విగ్రహాల నిమజ్జనానికి కూడా చెరువులు కనిపించని దుస్థితి ఎదురవుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు, పశు పక్ష్యాధులు దాహం తీర్చేందుకు, మానవ జీవనానికి, జలచక్రానికి ఉపకరించే చెరువులు కొంతమంది అక్రమార్కులు దర్జాగా ఆక్రమణలు చేస్తున్నారన్నారు. వాటిల్లో పక్కా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత ఇరిగేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ, సచివాలయం, రెవెన్యూ యంత్రాంగాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. దీనివలన రానున్న భవిష్యత్ కాలానికి చెరువులు లేని సమాజం చేరువవుతుందన్నారు. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆయా శాఖల అధికారుల కళ్ళముందే కబ్జాలు జరుగుతున్నప్పటికీ కనీసం స్పందించడం లేదన్నారు. కబ్జాలను అడ్డుకొని ఆక్రమణలు తొలగించేలా వారికి బుద్ధిని ప్రసాదించాలని వినాయకున్ని కోరారు. అలాగే కబ్జాకు పాల్పడుతున్న వారికి కఠినంగా శిక్షించాలని, కబ్జాలు, ఆక్రమణలు తొలగించి చెరువులను పరిరక్షించుకోవాలని వినాయకున్ని కోరారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. తాము సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికి కబ్జాల విషయం తీసుకువెళ్లినప్పటికీ కనీస చర్యలు లేకపోవడంతో విఘ్నాలు తొలగించే విఘ్న నాయకుడు వినాయకుడి దృష్టికి సమస్య తీసుకెళ్లడం జరిగిందన్నారు.