జనసేనాని పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలి

  • పార్వతీపురంలో దొంగతనాలు అరికట్టాలి
  • అదనపు ఎస్పీని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం, జనసేన పార్టీ వ్యవస్థాపకులు, జనసేనాని పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలని పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ ను జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చెందక అనిల్ కుమార్, వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, బంటు శిరీస్, నెయ్యుగాపుల సురేష్, శిరిపురపు గౌరీ శంకర్, మండల శరత్ బాబు, రమేష్ తదితరులు జిల్లా అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ ను కలిసి పవన్ కళ్యాణ్ భద్రత విషయంతో పాటు, పార్వతీపురంలో జరుగుతున్న దొంగతనాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలని ఎటువంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టే విధంగా జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయం ద్వారా రాష్ట్ర డిజిపికి వినతి పత్రాన్ని ఇస్తున్నామన్నారు. వైజాగ్ ఘటన ముందు నుండి పవన్ కళ్యాణ్ పై అరాచక శక్తులు రెక్కీ నిర్వహిస్తున్నాయని, వైజాగ్ సంఘటన తర్వాత కూడా తన నివాసము, కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించడం, కాన్వాయ్ లోకి వాహనం రావడం తదితర సంఘటన నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో తమ జనసేనాని పవన్ కళ్యాణ్ కు అవసరమైన గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇటీవల పార్వతీపురంలో దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయని, దీనికి ప్రజలు భయాందోళన చెందుతున్నారని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన జిల్లా ఆదరణ పిఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టేందుకు నిఘా పెంచామని, ప్రత్యేక బలగాలను రప్పించామని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. దొంగలను పట్టుకునే విషయంలో దొంగతనాలు అరికట్టే విషయంలో చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అదనపు పిఎస్పీకి వినతి పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా ఆసుపత్రి జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు.