నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడతాం

* ఏటా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాం
‘యువతే దేశానికి వెన్నెముక’ అంటారు. అలాంటి యువత భవిష్యత్తు వైసీపీ ప్రభుత్వ హయంలో నాశనమైందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 22 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. 2018 సంవత్సరంలో 4 శాతం ఉన్న రాష్ట్ర నిరుద్యోగ రేటు ప్రస్తుతం 7.7 శాతానికి పెరిగింది. ఇది దక్షిణాదిలోనే ఎక్కువ. దాదాపు 28 లక్షల మంది యువత ఉద్యోగాలు లేక నైరాశ్యంలో కుంగిపోయారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్యే 6.16 లక్షలు. పేర్లు నమోదు చేసుకోని వారూ ఇంకెన్ని లక్షల్లో ఉంటారో మన అర్థం చేసుకోవచ్చు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా.. భర్తీ చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. కియా అనుబంధ పరిశ్రమలు, జాకీ కంపెనీ, ఏపీపీ పేపర్ మిల్స్, లూలూ, తిరుపతికి రావాల్సిన భారీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఇలా అనేక కంపెనీలు వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. జనసేన – టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రతీ ఉద్యోగాన్ని వెంటనే భర్తీ చేస్తాం. ఏటా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అన్ని ఖాళీలను భర్తీ చేస్తాము. ప్రైవేటు సెక్టార్ ను ప్రోత్సహించి లక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో సృష్టిస్తామని హామీ ఇస్తున్నామమని శ్రీ నాగబాబు పేర్కొన్నారు.