ఇసుక దోపిడీపై జనసేన రాష్ట్రవ్యాప్త ఉద్యమం

• ఇసుక అక్రమాలు అడ్డుకున్నందుకే జన సైనికులపై దాడి
• జిల్లాలు, నియోజకవర్గాలవారీగా వైసీపీ నేతలు వాటాలు పంచుకున్నారు
• సీఎంకు చిత్తశుద్ది ఉంటే సామాన్యుడికి ఇసుక ఎందుకు అందడం లేదో చెప్పాలి
• పక్క రాష్ట్రాలకు ఇసుక ఎందుకు తరలిపోతోంది?
• ఆకుమర్రులో జనసైనికులపై దాడిని ఖండిస్తున్నాం
• ముఖ్యమంత్రి పంచతంత్ర కథలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు
• సొంత చెల్లికే భరోసా ఇవ్వలేని సీఎం జగన్ రెడ్డి
• కృష్ణా జిల్లా గూడూరులో మీడియాతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఇసుక అక్రమ తవ్వకాలపై త్వరలో జనసేన పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టు చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకే పెడన నియోజకవర్గం, ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ సంబంధీకులు దాడి చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక ఎందుకు అందడం లేదో, ఇతర రాష్ట్రాలకు ఇసుక ఎందుకు తరలిపోతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు దోచుకుంటూ మరో వైపు పంచతంత్ర కథలు చెబుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. బుధవారం పెడన నియోజకవర్గం, గూడూరులో వైసీపీ శ్రేణుల చేతిలో దాడికి గురైన జనసేన పార్టీ నాయకులు శ్రీ బత్తిన హరిరామ్, శ్రీ సమ్మెట గణపతి, శ్రీ రామకృష్ణ తదితరులను పరామర్శించారు. దాడి సందర్భంగా తగిలిన దెబ్బలను పరిశీలించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం, ఆకుమర్రు గ్రామంలో జరిగిన సంఘటనలో గాయపడిన పార్టీ నాయకులలో ధైర్యం నింపేందుకు ఇక్కడకు వచ్చాం. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకుంటుంటే మా జన సైనికుల్ని దుర్మార్గంగా చెట్టుకి కట్టేసి గంటసేపు నిర్భంధించి కొట్టారు. ఈ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
* ఒక్కో నేత నెలకు రూ.20 కోట్ల దోపిడీ
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పేదలకు లారీ ఇసుక అందించలేని ప్రభుత్వం.. తమ నాయకుల జేబులు నింపేందుకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వాటాలు పంచేసింది. ఒక్కో నేత నెలకి రూ. 20 కోట్లు సంపాదించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఇసుక దోపిడి గురించి జనసేన పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. అడ్డుకున్న వారిని ఇలా భయబ్రాంతులకు గురి చేసి కేసులు పెడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీ జోగి రమేష్ వ్యవహార శైలి ఒక మంత్రిగా తన పదవికి గౌరవం పెంచే విధంగా లేదు. ఈ విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. దాడికి వ్యక్తిగత కారణాలుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్, జిల్లా కోర్టుల్లో వ్యాజ్యాలు వేయడం వల్లే శ్రీ హరిరామ్ మీద కక్ష పెంచుకుని దాడి చేశారు. ఇది దుర్మార్గ చర్య. ఖచ్చితంగా జనసేన పార్టీ వారికి అండగా నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి భరోసా ఇస్తున్నాం. పార్టీ మీ వెంట ఉంటుంది. అందరం వారికి అండగా నిలబడదాం.
• గత నెల నొక్కిన బటన్ కే గతి లేదు
ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో మరొక్కసారి బటన్ నొక్కారు. నెల రోజుల క్రితమూ బటన్ నొక్కారు. అప్పుడు నొక్కిన బటన్ ద్వారా ఎంత మందికి సంక్షేమం అందింది? పంచతంత్ర కథలు చెప్పి ముంచేస్తున్నారు. సంక్షేమం పేరిట బంగారు గాజు చూపించి ప్రజల్ని ముంచేశారు. సంక్షేమం కొంత మందికే అందుతోంది. మీరు నొక్కిన బటన్ల కార్యక్రమం కేవలం 30 శాతం మంది లబ్దిదారులకే చేరుతోంది. అద్భుత కార్యక్రమాలు చేస్తున్నాం అక్కా చెల్లెళ్ల కోసం అని చెబుతున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న తన కుటుంబంలో సొంత చెల్లికే భరోసా ఇవ్వలేరు. గౌరవించలేరు.
* బైజూస్ పేరుతో కుంభకోణం
అద్భుతంగా చదువుల్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. బైజూస్ బోధన పేరిట రూ.700 కోట్ల స్కామ్ చేశారు. బైజూస్ యాప్ ట్యాబ్ ల ద్వారా ఎంత మందికి చదువులు చెబుతున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. పంచతంత్ర కథలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. సంక్షేమం ప్రజలకు చేరవేడంలో విఫలమయ్యారు. అభివృద్ధి చేయడం లేదు. వారి ఆస్తులు పెంచుకునేందుకు దోచుకుంటూ ప్రజల్ని ఇబ్బందిపెడుతున్నారు. ప్రతి వారం అప్పులు తెస్తూ అద్భుతం జరిగిపోతోందని మభ్యపెడుతున్నారు” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు బండి రామకృష్ణ, తాడిశెట్టి నరేష్, బూరగడ్డ శ్రీకాంత్, శింగలూరి శాంతి ప్రసాద్, బొలియాశెట్టి శ్రీకాంత్, మత్తి వెంకటేశ్వరరావు, శ్రీమతి రావి సౌజన్య, వికృతి శ్రీనివాస్, సారధి బాబు తదితరులు పాల్గొన్నారు.