కడప గడపలో కౌలు రైతు కుటుంబాలకు జనసేనాని భరోసా

ఉమ్మడి కడప జిల్లాలో రైతులకు ఆర్థిక సాయం
•ప్రతి కుటుంబాన్ని పేరు పేరునా పలకరించి చెక్కులు అందించిన శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేనానికి అపూర్వ స్వాగతం
•దారి పొడుగునా గజమాలలతో ముంచెత్తిన జనసైనికులు
•దేవుని కడప, భాకరాపేట మీదుగా సిద్ధవటం వరకు కిక్కిరిసిన రహదారి

ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబం కన్నీరు తుడుస్తూ సాగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా 190 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మధ్య 119 కుటుంబాలు సిద్ధవటం సభకు తరలివచ్చాయి. ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శిస్తూ, ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికీ స్వయంగా రూ. లక్ష చెక్కులు అందచేశారు. వారి బిడ్డల చదువులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు.
•విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి కడప జిల్లాకు వచ్చిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు అమలు చేసినప్పటికీ వెలుపలి ద్వారం వద్దకు వేలాదిగా జన సైనికులు ఉదయమే చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ నాయకులతో కలసి సిద్ధవటం బయలుదేరారు. విమానాశ్రయం బయట ఆయనకు భారీ గజమాలలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వందలాది బైకులు, కార్లతో ర్యాలీగా సిద్ధవటం వైపు కదిలారు. నగరానికి చెందిన జనసేన శ్రేణులు బాణాసంచా పేలుళ్లతో ఆహ్వానం పలికాయి. భారీ గజమాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేశారు. అక్కడి నుంచి శ్రీనివాస కాలనీ, భాకరాపేటల మీదుగా సిద్ధవటం చేరుకున్నారు. సిద్ధవటం గ్రామంలోకి ఆడపడుచులు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా, జన సైనికులు పూల వర్షం కురిపించారు. వీధికో గజమాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, ప్రజలతో సిద్ధవటం జనసంద్రంగా మారింది.
•జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆంక్షలు
ఉమ్మడి కడప జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు అమలు చేసింది. జిల్లావ్యాప్తంగా పోలీసుల సాయంతో పార్టీ శ్రేణుల్నీ, ప్రజల్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు తరలివెళ్లకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజంపేట చుట్టుపక్కల నియోజకవర్గాలైన రాయచోటి, రైల్వే కోడూరుల నుంచి ప్రజలు తరలిరాకుండా వైసీపీ నాయకులు బెదిరింపులకి దిగారు. పులివెందుల, కమలాపురం, మైదుకూరు తదితర నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో కొంత మందిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందదని చెప్పి తీవ్రంగా ఒత్తిడి తెచ్చి మరీ సభకు రాకుండా అడ్డుకున్నారు.

•జనసేనలోకి అతికారి కుటుంబం
రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటంకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ అతికారి వెంకటయ్య కౌలు రైతు భరోసా వేదికపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటయ్యతోపాటు ఆయన కుమారుడు శ్రీ అతికారి దినేష్, సోదరుడు శ్రీ అతికారి కృష్ణ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *