జిల్లెళ్లలో శ్రీ గైని నరహరి కుటుంబానికి జనసేనాని చేయూత

జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల నియోజకవర్గం జిల్లెళ్ళలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు గైని నరహరి కుటుంబాన్ని పరామర్శించారు. ఎప్పటినుంచో వ్యవసాయాన్ని నమ్ముకున్న నరహరి ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుశెనగ వేశారు. సరైన దిగుబడి రాక, కౌలు డబ్బులు కట్టుకోలేక అప్పుల పాలయ్యాడు. భారీగా అప్పులు ఎదురుగా కనిపించే సరికి ఏం చేయాలో తెలియక, వాటిని తీర్చే దిక్కులేక పురుగుల మందు తాగి పొలంలోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరహరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అప్పుల వారి బాధలు పడలేక ఇంట్లోని నగలు కుదువ పెట్టి అప్పులు తీర్చామని మృతుని భార్య శ్రీమతి మహాలక్ష్మి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాపోయారు. ఏడాదిన్నర క్రితం కుదువ పెట్టిన నగలకు వడ్డీ మీద వడ్డీ అవడంతో వాటిని కనీసం విడిపించుకునే స్తోమత కూడా తనకు లేదంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ బాధలు చెప్పుకొన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని, ఎన్నోసార్లు వాలంటీర్లకు, సచివాలయాలకు తిరిగినా ఫలితం లేకపోయిందని బాధితులు చెప్పారు. వారి బాధలు, కుటుంబ సమస్యలు విన్న పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి తగిన ధైర్యం చెప్పారు. రూ లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ వంతుగా కచ్చితంగా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకుడు ఎస్.వెంకప్ప పాల్గొన్నారు.