వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా మారింది

• సంపాదన కోసం ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇసుక, మట్టి తినేస్తున్నారు
• ఉత్తరాంధ్రలో మాఫియాలపై జనసైనికులు బలంగా పోరాడుతున్నారు
• రుషికొండకు గుండు కొడితే అడ్డుకున్నది జనసేనే
• స్వార్ధం లేని వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్
• నాయకుడిని ఫాలో అయితే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయం
• జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లంచగొండితనం సింగిల్ విండోలా మారిపోయిందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సంపాదన కోసం ఇసుక, మట్టి ఇష్టారీతిన తినేస్తున్నారని తెలిపారు. అందుకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారిదని చెప్పారు. స్వార్థం, కపటత్వం, లంచగొండితనం లేని మంచి మనిషి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ అన్నారు. మన నాయకుడి నిర్ణయాన్ని గౌరవిస్తూ.. ఆయన చెప్పింది వింటూ ముందుకు వెళ్తే 2024లో జనసేన పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చన్నారు. శనివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లమని అనుమతి ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర పర్యటనతో పార్టీ స్థితిగతులపై మంచి అవగాహన వచ్చింది. అక్కడ జనసైనికులు పూర్తి స్థాయిలో ఛార్జ్ అయి ఉన్నారు. మోటివేట్ అయ్యి ఉన్నారు. వారు చెబుతోంది ఒకటే జనసేన పార్టీని నిలబెట్టడం కోసం 90 శాతం పని చేసేశారు. పార్టీ నాయకులు గాని, జనసైనికులు గాని మరో 10 శాతం కష్టపడితే విజయం తధ్యం అన్న నమ్మకంతో ఉన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో చేయాలి, యాత్రలు చేయాలి అని వారు కోరుకోవడం లేదు. ఏం చేసినా తామే చేయాలంటున్నారు.
• జన సైనికులు వస్తే చాలు అనే పరిస్థితులు వచ్చాయి
రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందుగా గుర్తు వచ్చే పేరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన వచ్చినా, ఆ సమస్యపై మాట్లాడినా పరిష్కారం అవుతుందన్న నమ్మకం చాలా మందికి ఉంది. అది ఆయన కష్టం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైనా సమస్య వస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారే రానవసరం లేదు, జనసైనికులు వస్తే చాలు మా సమస్యలు పరిష్కారం అయిపోతాయన్న నమ్మకానికి వచ్చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసైనికులు చాలా చోట్ల అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలను సమర్ధవంతంగా ప్రతిఘటిస్తున్నారు. మాఫియా జనసైనికులకు దొరకకుండా దొంగతనంగా దోచుకుంటున్నారు. వీలుకాని పరిస్థితుల్లో జనసైనికులకు డబ్బు ఆశ చూపి విఫలయత్నం చేస్తున్నారు. జనసైనికులతో పోలిస్తే నేను పార్టీకి చేస్తోంది చాలా తక్కువ.
• వారు నైతికంగా గెలిచారు
ఓ వ్యక్తి రూ. 40 లక్షల విలువ చేసే వ్యాపారాన్ని వదులుకుని మరీ జెడ్పీటీసీ ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. వ్యాపారాన్ని వదులుకుని జనసేనను గెలిపించాలనుకున్నాడు. మరో ఆటో డ్రైవర్ ఎన్నికల్లో పోటీ చేస్తే రూ. 9 లక్షలు ఇస్తామని ఆశ చూపినా తిరస్కరించారు. ఎన్నికల్లో ఓడినా వారు నైతికంగా గెలిచారు. పార్వతీపురం ప్రాంతంలో ఓ అమ్మాయి సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఆమె తండ్రి నా బిడ్డల్ని జనసేనకు అంకితం ఇచ్చానని చెప్పారు. జనసేన జాని అనే సోదరుడు పార్టీ గెలిచే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. విశాఖలో రుషికొండకు అధికార పార్టీ గుండు కొట్టేస్తే దాన్ని ప్రతిఘటించింది మన జనసైనికుడు శ్రీ మూర్తి యాదవ్. అనకాపల్లి అక్రమ మైనింగ్ మీద ఈశ్వర్ అనే జనసైనికుడు పోరాడుతున్నారు. రాత్రిపగలు పని చేస్తే గాని నేను వారికి చేరువకాను.
• శ్రీ అవంతి ఎర్రమట్టిని తినేస్తున్నారు
ఉత్తరాంధ్రలో వలసలు సాధారణంగా మారిపోయాయి. పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలు వలసపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం మట్టిని కూడా తినేస్తున్నారు. శ్రీ అవంతి శ్రీనివాస్ ఎర్రమట్టి కొండల్లో ఎర్ర మట్టిని తినేస్తున్నాడు. ఈ పాటికి ఒక కొండ మొత్తం తినేసి ఉంటాడని నాకు అనుమానం. ఓ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చెప్పినట్టు జనసేన ఇద్దరు కౌలు రైతుల్ని పట్టించుకోలేదు. శాసనసభను కౌలుకు తీసుకున్న శ్రీ జగన్ రెడ్డి, శ్రీ చంద్రబాబుకి చెరో రూ. లక్ష ఇవ్వొచ్చుగా అని అడిగారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా నేను ఒప్పుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత ఆయన తీసుకున్న ఏ నిర్ణయాన్ని నేను ప్రశ్నించను. చెప్పిన పని చెప్పినట్టు చేస్తాను. ఒక్కసారి నాయకుడిగా స్వీకరించిన తర్వాత ఆయన నిప్పుల్లో దూకమన్నా దూకాలి. ఆయన తీసుకున్న నిర్ణయం మీద రెండో మాట మాట్లాడకుండా పని చేసుకుంటూ పోవాలి. అధ్యక్షుల వారి నిర్ణయాన్ని ప్రశ్నించడం అంటే ఆయన్ని ప్రశ్నించినట్టే. కళ్లు మూసుకుని ఆయన్ని అనుసరిస్తే 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు” అన్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ శాంతిమంత్రమే ఫలితాన్నిచ్చింది: కందుల దుర్గేష్
పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మాట్లాడుతూ “ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయ పక్షం రాష్ట్రంలో అధికారంలో ఉంది. నిరంతరం కక్ష సాధింపు, నియంతృత్వం నినాదాలుగా ముందుకు వెళ్తోంది. ఆ వికృత క్రీడలో తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతాన్ని పావుగా మార్చి కులాలు, వర్గాల మధ్య విబేధాలు సృష్టించేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని ప్రజలంతా గుర్తించారు. ఇంత అల్లర్లు జరిగితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నూటికి నూరు శాతం స్పందించాలి. ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ శ్రీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విషయంలోగానీ, అమలాపురం అల్లర్ల విషయంలో గానీ స్పందించలేదు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించి ప్రజల మధ్యకు వచ్చి తన విధానాన్ని వెల్లడించిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జిల్లా ప్రజలంతా కూడా ఘర్షణ వాతావరణం రాకుండా కాపాడింది జనసేన పార్టీయే అని అంటున్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు జనసేన దగ్గరకు చేరుతున్న పరిస్థితుల్లో, ఎమ్మెల్సీ డ్రైవర్ హత్యోదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఉద్యమానికి సిద్ధమౌతున్న పరిస్థితుల్లో ఓ పథకం ప్రకారం కోనసీమ అల్లర్లు సృష్టించారు. మంత్రి స్వయంగా వైసీపీ కౌన్సిలర్ పాత్ర ఉందని చెబితే, రాజోలుకు చెందిన జనసేన కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేశారు. జనసేన మీద కక్ష సాధింపుకు అది నిదర్శనం” అన్నారు.
• కోనసీమను శాంతిసీమగా మార్చే బాధ్యత జనసేనదే: పితాని బాలకృష్ణ
పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ “కోనసీమలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. శ్రీ జగన్ రెడ్డి చేసిన కుతంత్రంలో భాగంగానే ఇది జరిగింది. హోంమంత్రి ప్రకటన దుర్మార్గం. పరిస్థితులు చూస్తే అసలు హోంమంత్రి ఉందా లేదా అర్ధం కాని పరిస్థితి. అల్లర్లు జరిగితే హోంమంత్రిగానీ, డీజీపీ గాని తొంగి చూసిన దాఖలాలు లేవు. బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు జనసేన వైపు చూస్తున్నారన్న ఉద్దేశంతోనే ఏదో ఒక చిచ్చు పెట్టాలన్న దుర్బుద్దిలో భాగంగానే ఈ దహనకాండకు శ్రీకారం చుట్టింది. కోనసీమను శాంతిసీమగా మార్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంద”న్నారు.
• అమలాపురంలో విధ్వంసం సృష్టించింది స్థానికులు కాదు: శ్రీ శెట్టిబత్తుల రాజబాబు
పార్టీ అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ “కోనసీమ విధ్వంసం పూర్తిగా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వారు కూడా కోనసీమ అల్లర్ల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని చెబుతున్నారు. శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్నిదళితులు గుర్తించారు. దళితులకు ఆర్ధిక స్వావలంబన లేకుండా చేశారు. ఈ అన్యాయాలన్నీ గుర్తెరిగి దళితుల్లో మార్పు వస్తుండడాన్ని గ్రహించే ఈ దాష్టికానికి దిగారు. దళితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితుల్ని చూసి విధ్వంసానికి రచన చేసింది. అమలాపురంలో విధ్వంసం సృష్టించిన వారు స్థానికులు కాదు. అపరిచితులు అమలాపురంలో ప్రవేసించి విధ్వంసం చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను తప్పించుకోవడానికి అమాయకులైన యువకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి జనసేనను దోషిగా చిత్రించే ప్రయత్నం చేస్తోంద”ని చెప్పారు.
• పవన్ కళ్యాణ్ ఇచ్చిన ధైర్యమే స్ఫూర్తినిచ్చింది: శ్రీ పంతం నానాజీ
పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ మాట్లాడుతూ “ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్య విషయంలో జనసేన పార్టీ బాధిత కుటుంబం తరఫున బలంగా నిలిచింది. హతుడి కుటుంబాన్ని భయపెట్టి కేసు నుంచి బయటపడాలని చూస్తున్న తరుణంలో మన పార్టీ చేసిన పోరాటంతో ఆ కుటుంబంలో ధైర్యం వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన తర్వాత అధ్యక్షుల వారిచ్చిన ధైర్యం మా అందరిలో స్ఫూర్తిని నింపింది. జిల్లా నాయకత్వం మొత్తం ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తిరిగాం. ఈ లోపు ప్రభుత్వ సలహాదారు శ్రీ జూపూడి ప్రభాకర్ రావు శెట్టిబలిజ సోదరుల గురించి సెన్స్ లేకుండా మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆయన మాట్లాడిన మాటలు ఒక తరం శెట్టిబలిజల నాశనం చేశాయ” అని తెలిపారు.
• జనసేన దెబ్బకి వారి పునాదులు కదులుతున్నాయి: శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ “కౌలు రైతుల సమస్యలను జనసేన దిండి మేధోమధనంలోనే చర్చించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం కౌలు రైతుల్ని ఇబ్బంది పెడుతుందని ఆనాడే గ్రహించాం. దాని పర్యవసానాలు ఇఫ్పుడు రైతాంగం ఎదుర్కొంటొంది. కోనసీమ అంశం భారీ స్కెచ్ లో భాగం. జనసేన పార్టీని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం అల్లర్ల స్కెచ్ వేసింది. సంఘటన జరిగిన రెండు గంటల్లోపే జనసేన హస్తం ఉందని హోంమంత్రి చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా జనసేన ముందుకు రావడంతో వారి పునాదులు కదిలిపోతున్నాయి. జనసేన పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలే ఊపిరిగా ముందుకు నడుస్తోంది. భావజాలం, ఐకమత్యం, నిజాయితీ, నిబద్దతలే పార్టీ బలం” అన్నారు.
• ప్రజలతో తిట్టించేందుకే వారికి మంత్రి పదవులు: శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాల మంత్రులతో చేయించిన బస్సు యాత్ర తుస్సుమంది. తప్పులు చేసేది ముఖ్యమంత్రి సామాజికవర్గం అయితే, ప్రజలతో తిట్టించేంది మాత్రం ఇతర సామాజికవర్గాల మంత్రుల్ని. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రజలతో తిట్టించేందుకే మంత్రి పదవులు ఇచ్చారు. ఇదేనా మీకు తెలిసిన సామాజిక న్యాయం. రాష్ట్రాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించేందుకు కోనసీమను నాశనం చేశారు. ఎస్సీ, బీసీలు ఏమీ అనలేరు కాబట్టే ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టించారు” అని తెలిపారు.
• విధ్వంసంతో పాలన మొదలపెట్టారు: శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజునే విధ్వంసంతో పాలన మొదలుపెట్టారు. ఇప్పుడు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ఆలోచనతో చేసిన ప్రయత్నాన్ని ప్రజలు బలంగా తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్తూ.. తన సీటుకు ఎవరైనా ఎసరుపెడతారేమోనన్న భయంతోనే మంత్రుల్ని బస్సు యాత్రకు పంపారు. ఒక్క మంత్రికి కూడా తమ శాఖ మీద పట్టు లేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన హామీలు అమలు పర్చడం మినహా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు” అని చెప్పారు.
• శ్రీ జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గం సుఖంగా లేదు: శ్రీ పెదపూడి విజయ్ కుమార్
ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ “ఒక్క ఛాన్స్ ఇస్తే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని చిందరవందర చేశాడు. శ్రీ జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గం సుఖంగా లేదు. ఈ అసమర్ధ, దద్దమ్మ పాలనను కప్పిపుచ్చుకునేందుకు ఏదో విధ్వంసం సృష్టించాలన్న లక్ష్యంతోనే కోనసీమ అల్లర్లకు తెరతీశారు. రాష్ట్ర ప్రజలంతా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు” అన్నారు.
• మైనారిటీలకు మంత్రి పదవి ఇస్తే సమస్యలు తీరిపోవు: శ్రీ షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ “మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన వారి సమస్యలు తీరిపోవు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించింది లేదు. గాలి పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నార”ని అన్నారు.
• రాయలసీమ ప్రజల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు: శ్రీమతి రేఖాగౌడ్
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీమతి రేఖాగౌడ్ మాట్లాడుతూ “నేనున్నాను.. నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన శ్రీ జగన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసాలు మినహా చేసిందేమీ లేదు. వాళ్ల పబ్బం గడుపుకోవడానికే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల వెనుకపడ్డారు. రాయలసీమ ప్రజల్ని వైసీపీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంత మంది కౌలు రైతులు చనిపోతుంటే వారికి అండగా నిలచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే” అని చెప్పారు’. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ పోతిన వెంకట మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, సయ్యద్ జిలానీ తదితరులు ప్రసంగించారు.