అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని స్వాగతించిన కేసిఆర్

కేంద్ర ప్రభుత్వ నిర్ణయమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వాగతించారు. నదీ జలాల వినియోగం విషయంలో కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య వివాదం నెలకొంది. ఈ వివాదాన్న తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతించారు. ఆ సమావేశంలో నదీ జలాల విషయంలో కేంద్ర, ఏపీ ప్రభుత్వాల సందేహాల్ని నివృత్తి చేస్తామన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికుకున్న అభ్యంతరాల్ని కూడా సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు కేసీఆర్.  అపెక్స్ సమావేశం అజెండాలో చేర్చాల్సిన అంశాల్ని లేఖ ద్వారా కేంద్రానికి తెలియపరుస్తామన్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు లేవనెత్తిన అన్ని సందేహాల్ని నివృత్తి చేసే విధంగా సమగ్ర సమచారాన్ని సిద్ధం చేయాలన్నారు కేసీఆర్. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్టుల్ని అవసరాల నిమిత్తం రీ డిజైన్ చేశాము తప్ప…కొత్తవేవీ నిర్మించడం లేదన్నారు. అటు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యల్ని గట్టిగా తిప్పికొట్టేలా అభ్యంతరం చెప్పాలని అధికార్లకు సూచించారు.

 కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివేనని సిఎం  కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సిఎం చెప్పారు.