నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన కేటీఆర్

తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో వివిధ రంగాలను ఆదుకునేందుకు రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఏడాదికి పైగా అవుతోందని లేఖలో ఆయన గుర్తు చేశారు.

ఈ ప్యాకేజీ ద్వారా తెలంగాణ తయారీ రంగానికి అత్యంత కీలకమైన సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు లబ్ధి చేకూరేలా తాను గట్టి ప్రయత్నం చేస్తూ వచ్చానని చెప్పారు. అయితే కేంద్రం ప్రకటించిన ఆకర్షణీయ ప్యాకేజీలో కేంద్ర, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పరిశ్రమలు 80 శాతానికి పైగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ చెప్పారు. మీ ప్యాకేజీలో ప్రత్యేక ఆకర్షణ లేదని ఇక్కడి ఎస్ఎంఈలు భావిస్తున్నాయని తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన ప్రక్రియ కూడా చాలా సంక్లిష్టంగా ఉందని చెప్పారు. కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ పథకం ఉందని విమర్శించారు. ఈ పథకం మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు.