అధిష్టానాలు పునరాలోచించాలి: డా.వంపూరు గంగులయ్య

పాడేరు జనసేనపార్టీ కార్యలయంలో ముఖ్యనాయకులతో అరకు పార్లమెంట్ మరియు పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య శుక్రవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాడేరులో ఉన్నటువంటి రాజకీయపరిస్థితులు నియోజకవర్గ ప్రజలను కూటమి కార్యకర్తలను విపరీతమైన గందరగోళానికి గురిచేస్తోందని, కూటమి అధిష్ఠానాలు ఒక నిర్ణయనికొచ్చి వాస్తవిక పరిస్థితులు సమీక్షించి సరైన అభ్యర్థి ఎంపిక చేయాలని, లేదంటే వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయన్నారు. అర్బన్ నియోజకవర్గాలవలె సర్వేలకు అనువైన నియోజకవర్గం కాదని కూటమి పార్టీల ఆశావహులు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక చేయరాదని, గిరిజన ప్రజలు, కార్యకర్తల మనోభావాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే జనసేనపార్టీకి టికెట్ కేటాయిస్తే కచ్చితంగా వైసీపీ పార్టీకి సరైన ప్రత్యర్థి అవుతుందని యువతలో వైసీపీపై తిరుగుబాటు స్వరం బలంగా ఉందని కూటమి సహాయంతో భారీ మెజారిటీతో గెలిచే అవకాశముందని అన్నారు. జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి పాడేరు నియోజకవర్గంపై ఒక ఆలోచన చేయాలని కార్యకర్తలు, గిరిజన ప్రజలు కోరుతున్నారన్నారు. పొత్తుధర్మం పాటిస్తామని అంటూనే బలహీనమైన అభ్యర్థి ఎన్నుకుంటే అది కూటమికి తప్పకుండా నష్టమే జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రూరల్ జిల్లా ఉపధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బోనుకుల దివ్యలత, ప్రధాన కార్యదర్శి ఉల్లి సీతారామ్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కొయ్యురు మండల అధ్యక్షులు గూడెపు లక్ష్మణ్ రావు, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, రాజుబాబు తదితర ముఖ్య నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.