గ్రామ స్థాయిలో జనసేన బలంగా ఉంది

*ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దం
*మీడియాతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు
జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేసారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో నాగబాబు గారు మాట్లాడారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎడ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, పోటీలో నిలిచిన వారితో మాట్లాడడం జరిగిందని అన్నారు. జన సైనికులలో ఎక్కువ శాతం మేధావులు, విద్యావంతులు, ఐ.టీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరి ఆలోచన విధానం, మేధస్సు, పార్టీ గెలుపు కోసం వారు చేస్తున్న కృషి అమూల్యమైనది అని పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని, ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారు అని అన్నారు.