ఆస్కార్ రేస్ లో మలయాళ మూవీ ‘జల్లికట్టు’

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్స్ -2021 ఎంట్రీస్ లో చోటు సంపాదించింది. ఇండియా నుండి ఆస్కార్‌ నామినేషన్‌ కోసం హిందీ, మలయాళం, మరాఠీతో పాటు ఇతర భాషల నుంచి 27 సినిమాలు పరిశీలనకు రాగా వాటిలో నుంచి ‘జల్లికట్టు’ను ఎంపికచేసినట్లు ఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చైర్మన్‌ రాహుల్‌ రవైల్‌ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అకాడమీ అవార్డ్స్ లో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న చిత్రంగా ‘జల్లికట్టు’ నిలిచింది. సినిమా థీమ్, ప్రొడక్షన్ క్వాలిటీ, లిజో జోస్ ఫెల్లిస్సెరీ డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపించారు.

తమిళనాడులో వివాదాస్పద సంప్రదాయ బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆధారంగా సాగే జల్లికట్టు చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌, చెంబన్ వినోద్ జోస్‌, సబుమోన్ అబ్దుసమద్ కీలక పాత్రల్లో నటించారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కండ్లకు కట్టినట్టు చూపించిన జల్లికట్టు భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ఒకటి. 2019 అక్టోబర్‌లో కేరళలో విడుదలైన ఈ జల్లికట్టును 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 24 వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో కూడా ప్రదర్శించారు.

ఈ రెండు చోట్లా సినిమాకు చాలా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు గాను పెల్లిస్సేరీ 50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు ట్రోఫీని కూడా అందుకున్నారు. 2011లో ఆడమింటే మకాన్ అబూ తర్వాత గత దశాబ్దంలో ఆస్కార్ అవార్డులకు మన దేశం నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన రెండవ మలయాళ చిత్రం జల్లికట్టు.