నేటితో ముగియనున్న మేడారం మినీ జాతర

మేడారం మినీ జాతరలో మాఘ శుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సమ్మక్క జాతరలో ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉన్నది. నిండు పౌర్ణమి రోజునే సమ్మక్క దేవత గిరిజనులకు దొరికింది. పౌర్ణమి నాడే గిరిజనులను వీడి వన ప్రవేశం చేసింది. దీంతో పౌర్ణమిని పురస్కరించుకునే మహాజాతర, చిన్న జాతర నిర్వహిస్తున్నారు. శనివారం పౌర్ణమి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కాగా, వనదేవతలు కొలువై ఉన్న మేడారంలో జరుగుతున్న గత మూడు రోజులుగా మినీ జాతర నేటితో ముగియనుంది. బుధవారం ప్రారంభమైన చిన్న జాతర ఇవాళ ముగుస్తుంది. దీంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి వనదేవతల చెంతకు వస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన గద్దెలకు వచ్చి బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.