వెక్కిరిస్తున్న విదేశీ విద్యా దీవెన!

*రెండు విడతల్లో లబ్దిదారులు 357 మందే
* సాయం పొందింది రూ.45.53 కోట్లే
* రెండో విడత అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 50 మంది లోపే
*వీరిలో ఆర్థిక సాయం అందుకుంది 8 మందే

మాటలైతే కోటలు దాటుతుంటాయి. కాళ్లు మాత్రం కనీసం గడప కూడా దాటవు. ఇదీ ఏపీ సీఎం జగన్‌ పాలన తీరు! ఎప్పుడూ ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అంటుంటారు. చెప్పేది కొండంత, చేసేది గోరంత. వైద్యవిద్యకు సంబంధించి, ప్రభుత్వ కొత్త కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను ఏకంగా అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు ‘మరో అడుగు ముందుకు వేసి’ విదేశీ విద్యా దీవెన పథకానికి ఎడాపెడా గండి కొడుతున్నారు. ఉన్నత చదువులు చదవాలన్న పేద యువతీ యువకుల కలల్ని కల్లలు చేస్తున్నారు. వారిని అన్ని విధాలా వంచిస్తూ, ఒకటి చెప్పి మరొకటి చేస్తూ, మొత్తం పథకానికే నిట్టనిలువునా తూట్లు పొడుస్తున్నారు!
*ఆత్మస్తుతి…. పరనింద
విదేశీ విద్యా దీవెన పథకం ఇప్పటిది కాదు. మునుపటి ప్రభుత్వ హయాంలోనే ఇది అమలైంది. అప్పట్లో లబ్ది పొందిన వారి సంఖ్య బీసీలు 1926, కాపులు 1196, ఈబీసీలు 783, మైనారిటీలు 527, ఎస్సీ ఎస్టీలు 491. మొత్తం అంతా కలిపి 4923 మంది. వారందరికీ నాడు అందిన సాయం రూ. 380 కోట్లు. వైకాపా వచ్చిన తర్వాత, అసలు పథకాన్నే వరసగా మూడేళ్లపాటు పక్కన పెట్టేసింది. ఆటు తర్వాత పరిణామాల్లో, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో, తప్పనిసరై తిరిగి అమల్లోకి తెచ్చింది కానీ … అది పేద యువత మీద ప్రేమేమీ కాదు. ఇప్పటికి ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 357 మందికి రూ.45.53 కోట్లు ఇచ్చామన్నది ప్రభుత్వ ప్రకటన! విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా ఉంటున్నామన్నారు. ఒక్కొక్కరికి రూ.1.25కోట్ల మేర ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. విశ్వవిఖ్యాత వర్సిటీల్లో ఆంధ్రప్రదేశ్‌ పేద యువత చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రచారాలతో హోరెత్తించారు. ఇటువంటి సాయం దేశంలో ఇంకెక్కడా ఉండదని గొప్పలు చెప్పారు, చెప్తున్నారు. ఇదంతా విప్లవాత్మకం, చరిత్రాత్మకం అంటూ ఈ మధ్య నిధుల విడుదల సభలో తన భుజాలు తానే చరుచుకున్నారు జగన్‌. నిజమే. ‘ఇటువంటి’ సాయం ఇంకెక్కడా ఉండదు!
*మాయోపాయాలే అన్నీ
అంకెల గారడీలో ఆయనకు ఆయనే సాటి. ఆర్థిక సాయాన్ని అందరికన్నా మిన్నగా చేస్తున్నామన్నారు. అది ఏపాటిదో నాటినీ నేటినీ పోలిస్తే తెలుస్తూనే ఉంది. ఉన్నత విద్యారంగం గురించిన విశ్లేషణలను ప్రపంచవ్యాప్త సమాచారంతో అందిస్తుంది క్యూఎస్‌. అంటే క్వాక్వారెల్లి సైమండ్స్‌ సంస్థ. ఇది వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ వివరాలను అందిస్తుంటుంది. నిరుడు క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో ‘టాప్‌ 200’లో ఉన్న వర్సిటీల్లో సీట్లు పొందినవారికి ఆర్థిక సాయం చేస్తామంది వైకాపా ప్రభుత్వం. ర్యాంకింగ్‌ 100 వరకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందితే, వంద శాతమూ ఫీజులిస్తామంది. అటు తర్వాత వంద వరకు ఉన్న వర్సిటీల్లో సీట్లు వస్తే (ర్యాంకింగ్‌) సగం శాతం భరిస్తామంది. లేదా రూ.50 లక్షలు. ఏది తక్కువైతే అది అందిస్తామంది. ఆ మేర పథకం కింద దరఖాస్తులు కోరింది. అన్ని వర్గాల వారూ కలిపి మొదటి విడతలో 290 మంది అర్హులయ్యారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇలా పేదవర్గాల యువతీ యువకులు 119 మంది.
అంతే….తరువాత అర్హుల సంఖ్యలో కోత విధించేశారు. ఉన్నపళంగా సబ్జెక్టుల అంశాన్ని లేవనెత్తారు. వాటికి సంబంధించి ‘టాప్‌ 50’ ర్యాంకుల్లో ఉన్న వర్శిటీల్లో సీటు సాధిస్తేనే సాయం అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను హడావుడిగా సవరించేశారు. ఒక్కో సబ్జెక్టుకీ 50 నుంచి 70 వర్సిటీల కేటాయింపు పేరిట జగన్‌ తనదైన శైలిని ప్రదర్శించారు. అలా నియమ నిబంధనలన్నింటినీ అడ్డగోలుగా మార్చిపారేసింది ప్రభుత్వం. అన్ని తరహాల కోతలూ విధించాక, మిగిలింది ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో తెలుసా? యాభైమంది లోపు! ఆ కొద్ది మందిలోనూ తాజాగా సాయం అందుకుంది కేవలం 8 మంది. మిగిలిన వారు కొన్ని పత్రాలు సమర్పించాలని, కొన్ని విధివిధానాలు పూర్తి చేయాలని సూచించారు. ఆ పని పూర్తి చేసిన తరువాత ఆర్థిక సాయం చేస్తామన్నారు. సాయం అందుకున్న 8 మందిలో బీసీలు ఒక్కరూ లేరు. ఎస్టీ ఒక్కరే. ఎస్సీలు ఐదుగురు. మైనారిటీలు అయితే ఇద్దరే ఇద్దరు. విదేశీ విద్యా దీవెన అంటే ఇదేనా? దీవెన కాదు ` వంచన. వరం కాదు- శాపం!
*నిబంధనల సాకుతో కోత
పథకం కింద ఆర్ధిక సాయం ఒక్కసారిగా అందదు. నాలుగు వాయిదాల్లో వస్తుంది. తొలి విడతలో ఎంపికైన వారికి ఇప్పుడు రెండో వాయిదా కింద ఇస్తున్నారు. ఆ విద్యార్థులనూ ఇప్పుడు రెండో విడతలో ఎంపికైన వారితో కలిపి చూపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, లబ్ధిదారుల సంఖ్య పెరిగినట్లు కనిపిస్తుంది. అంతా మాయ. జగన్మోహన మాయాజాలం. లోపాయకారీ వ్యవహారాలతో, సరికొత్త నిబంధనల సాకు చెప్పి, అర్హుల సంఖ్యను తగ్గించేశారు. తొలి విడతగా ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత 119 మందితో పోలిస్తే, రెండో విడతలో సంఖ్య సగానికి సగం కోతపడినట్లే! ఈ సంఖ్య 50 లోపే.
రెండో విడత కింద ఎంపికైన బీసీ యువత 13 మంది మాత్రమే. వారిలోని ఏ ఒక్కరికీ ఆర్థిక సాయం అందలేదు. కొన్ని పత్రాలు సమర్పించాలంటూ అవి ఇచ్చిన తరువాత ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇవేవీ చాలవన్నట్లు, తొలి విడతగా ఎంపికైన 64 మందికి రెండో వాయిదా సాయాన్నీ తాజాగా కలిపేసి చూపిస్తున్నారు. దీంతో, లబ్ధిదారుల సంఖ్య పెరిగినట్లు అవుతుంది. ఇదీ జగన్మాయే! అలాగే, రెండో విడత కింద 12 మంది మైనారిటీ విద్యార్థులను అర్హులుగా గుర్తించినా, సహాయం దక్కింది ఇద్దరికే! ఎస్టీలకు సంబంధించీ, తొలి విడతలో ఒక్కరికీ సాయం చేయలేదు. ఇప్పుడైతే ఒకే ఒక్కరు లబ్ధిదారు. ‘ఇదేం దీవెన మహాప్రభో’ అని పలువురు తల్లడిల్లుతున్నారు. మాటల నసే తప్ప చేతల్లో పస లేని ప్రభుత్వం ఇదని బాధిత యువకులు నిరసిస్తున్నారు.