సమాజ శ్రేయస్సు కోసం సమష్టిగా పనిచేద్దాం

* సేవా కార్యక్రమాలకు ఎన్ ఆర్ ఐలు అందించిన తోడ్పాటు మరవలేనిది
* పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్దాం
* ప్రతి ఒక్కరు మరో వందమందిని ప్రభావితం చేసేలా పనిచేద్దాం
* ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు

జనసేన పార్టీ బలోపేతానికి ప్రవాస భారతీయులంతా తమవంతుగా సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రవాసీలుగా ఉన్న భారతీయులందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు అన్నారు. ఐరోప పర్యటనలో భాగంగా ఆదివారం ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఎంతో ఆలోచనతో కూడినవి. పార్టీ కోసం అహర్నిశలు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం దాని వెనుక ఉన్న కృషిని జనసేన పార్టీ సానుభూతిపరులు ప్రతి ఒక్కరు గ్రహించి దానిని ఇతరులకు తెలియజేసే బాధ్యతను తీసుకోవాలి. ఎంతో విజ్ఞానం ఉన్న ప్రవాస భారతీయులు మన దేశం నుంచి ఇతర దేశాలకు వచ్చి వారి వారి పనులు చేసుకుంటూనే, పార్టీ కోసం కొంత సమయం కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు. పార్టీ భావజాలాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా, భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తెలిసేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రవాస భారతీయుల సేవలు జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. వీటిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. గత పది రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్నాను. వేలాది మంది జనసేన పార్టీ సానుభూతిపరులను కలిశాను. ఒక్కొక్కరు వంద మందిని ప్రభావితం చేయగలిగితే పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుంది. పార్టీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు ఎన్ ఆర్ ఐలు అందించిన చేయూత మరవలేనిది. సమాజ శ్రేయస్సు కాంక్షించి పార్టీకి మద్దతుగా నిలబడిన ప్రతీ ప్రవాస జనసైనికుడు, వీరమహిళకు అభినందనలు” అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.