ఓటు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చేపడుతున్న రెండురోజుల పోలింగ్ కేంద్రాలలో ఓటు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరియు ఆయన కుటుంబ సభ్యుల ఓటరు నమోదు వివరాలను స్వయంగా మల్లయ్యాగ్రహారం మునిసిపల్ స్కూలులో నెలకొల్పిన కేంద్రంలో పరిశీలించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేసించి మాట్లాడుతూ ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు వివరాలు జాబితాలో పొందుపరచబడి ఉన్నాయో లేదో సరిచూసుకుని జాగ్రత్తపడాలని, ముందుగా జనసైనికులు తమ కుటుంబసభ్యులవి, స్నేహితులవి, చుట్టుపక్కలవారివీ ఇంకా ప్రజలవీ వెరిఫై చేయమని సూచించారు. నేడు మనం చాలా చోట్ల ఓటరులను జాబితానుండీ తొలగించారనీ, కుటుంబసభ్యులను అందరినీ ఒక కేంద్రంలో కాకుండా ఇష్టమొచ్చినట్టుగా రకరకాల కేంద్రాలలో పొందుపరచినట్లు వార్తలు చూస్తున్నామని ఇలాంటి వై.సి.పి పార్టీ కుటిల యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని ఎదుర్కొని గెలవలేమని ఈ అధికార వై.సి.పి పార్టీ ఇలాంటి దొంగదారులలో వస్తోందన్నారు. వై.సి.పి ప్రభుత్వంపై ప్రజలు ఏవగింపుతో ఉన్నారని వారికి తెలిసి వ్యతిరేక ఓట్లను తొలగించేస్తున్నారనీ, ఓటు మన ఆయుధం కాబట్టి దానిని కాపాడుకుని వచ్చే ఎన్నికలలో దానిని ఉపయోగించి ఈ ముఖ్యమంత్రికి వై.సి.పి పార్టీకీ బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.