న్యాయం చేయమంటే కేసులు పెడతారా…? – నాదెండ్ల మనోహర్

మృతుని కుటుంబానికి న్యాయం చేయమంటే కేసులు పెడతారా?

జనసేన నాయకులపై కేసులు అప్రజాస్వామికం

విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొనడంతో శ్రీ గేదెల సూర్యనారాయణ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందారు అనే వార్త మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి ఆగి ప్రమాదం బారినపడిన వ్యక్తి పరిస్థితి ఏమిటని కనీసం పరామర్శ కూడా చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరం. రెక్కల కష్టం మీద బతికే ఆ కార్మికుడి కుటుంబానికి న్యాయమైన పరిహారం ఇప్పించి, ఆ కుటుంబానికి ఆధారం కల్పించాలనే విషయాన్ని మంత్రికి తెలియచేసేందుకు వెళ్ళిన జనసేన నాయకులను పోలీసుల ద్వారా అడ్డుకొని అక్రమంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం. భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల, విశాఖ నార్త్ ఇంచార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ నాయకులు శ్రీ అప్పారావు, శ్రీ శాఖరి శ్రీనివాస్, శ్రీమతి అమరాపు దుర్గ, శ్రీమతి కళ, శ్రీమతి త్రివేణిలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యతను తీసుకోవాలని జనసేన హేతుబద్ధంగా డిమాండ్ చేసింది. న్యాయం చేయమని కోరితే కేసులుపెట్టడం ఏమిటి? బాధిత కుటుంబానికి బాసటగా నిలవడం బాధ్యత కలిగిన పార్టీగా జనసేన విధి. మంగళవారం అనంతపురంలో కూడా ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుంది. న్యాయం కోసం మాట్లాడే పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టులు, కేసులతో కట్టడి చేయడం భావ్యం కాదని శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.