కొరతల చెరలో కొత్త జిల్లాలు

*సరిపడా లేని సిబ్బంది
*ఉన్నవారికీ సకాలంలో అందని జీతాలు
*అదనపు బాధ్యతలతో అధికారులు సతమతం
*వాహనాలూ చాలినన్ని లేవు
*జనరేటర్లూ లేని ప్రధాన కార్యాలయాలు
*జిల్లా సైజు తగ్గినా ఇంకా ప్రజలకు దగ్గరకాని పాలన

ఈ ఏడాది ఏప్రిల్‌ 4న ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరిగింది. దాదాపు లోక్‌సభ నియోజకవర్గం సైజులో ఉన్న అన్ని జిల్లాలు ఉనికిలోకి వచ్చి నాలుగున్నర నెలలు దాటుతున్నా అన్ని జిల్లాల సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. జిల్లాల ముఖ్య పట్టణాల్లో, ఇతర పట్టణాల్లో ప్రభుత్వ విభాగాల కార్యాలయాల ఏర్పాటు పూర్తికావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి. ప్రతి ఆఫీసు గదిలోనూ దాని సైజుకు మించిన సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు సర్దుకుని కూర్చుని పనిచేసుకుంటున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. జిల్లా ప్రధానాధికారి డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌ ఉండే కలెక్టరేట్లు లేదా కలెక్టర్‌ కార్యాలయాలు తగినంత సంఖ్యలో సిబ్బంది, అధికారులు లేక కుంటి నడక నడుస్తున్నాయి. పాత జిల్లా ముఖ్య పట్టణం లేని కొత్త జిల్లాల్లోని నూతన ముఖ్య పట్టణాల్లో జిల్లా కలెక్టరేట్లు సహా, ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు భవనాల గుర్తింపు, ప్రభుత్వ సిబ్బంది కేటాయింపు వంటి ప్రక్రియలు పూర్తయ్యాయని ఉగాదికి కొన్ని రోజుల ముందే ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే, ఇంత వరకూ ఈ ప్రక్రియలు సంపూర్ణంగా పూర్తి కాక జనం, ప్రభుత్వ ఉద్యోగులు నానా పాట్లు పడుతున్నారు.
*చిన్న జిల్లాలు మంచివేగాని ….
గత కొన్ని దశాబ్దాల్లో జనాభా బాగా పెరిగిన దృష్ట్యా ఉన్న జిల్లాలను విభజించి చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం అత్యవసరం. కాని, చిన్న జిల్లాల సత్ఫలితాలు ప్రజలకు అందడానికి సమయం పడుతుందని నిపుణులు చెబుతారు. అయితే, ఈ ఫలాలు లేదా ఫలితాల సంగతి దేవుడెరుగు, అసలు కొత్త జిల్లాలకు తగిన పాలనాపరమైన రూపం లేదా మౌలిక సౌకర్యాలతో కూడిన వ్యవస్థలు నాలుగున్నర మాసాలైనా ఏర్పడకపోవడం విచారకరం. ప్రభుత్వ జఢత్వం వల్ల సాధారణ ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నియామకం తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుందని, ఆరు నెలల తర్వాత వారిని ఏం చేయాలనే విషయంపై సమీక్షిస్తామని జగన్‌ ప్రభుత్వం ఆరంభంలోనే ప్రకటించింది. కాని, ఈ తాత్కాలిక సిబ్బందిని సైతం తగిన సంఖ్యలో జిల్లా ముఖ్య పట్టణాల్లో నియమించలేకపోయింది రాష్ట్ర సర్కారు. ఇప్పుడేమో ఇంకో ఆరు నెలల్లో సిబ్బంది నియామక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాలనను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యం ఆమడ దూరంలో నిలిచిపోయింది.
*సీఎం దృష్టికి తెచ్చినా దిద్దుబాటు చర్యలు మృగ్యం
కొత్త జిల్లాల ఉన్నతాధికారులతో ఇటీవల ముఖ్యమంత్రి జరిపిన సమావేశంలో జిల్లాల పునర్విభజన పర్యవసానాలు ఎలా ఉన్నాయో కలెక్టర్లు ఆయనకు వివరించారు. సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపడతామని సీఎం చెప్పినా, అవి మందకొడిగా సాగుతున్నాయి. రోజూవారీగా సాధారణ ప్రాతిపదికన కొత్త కలెక్టరేట్లలో పనిచేస్తున్న సిబ్బందికి అత్యంత కీలకమైన వేతనాల చెల్లింపు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, బిల్లుల చెల్లింపులు నిరాటంకంగా సాగిపోవాలంటే డీడీఓ కోడ్‌తో సీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ ఐడీ అనుసంధానమై ఉండాలి. ఈ ఏర్పాటు సజావుగా లేక ఆర్డీఓలు, ఇతర ఉద్యోగులకు జీతాల చెల్లింపులు నాలుగైదు నెలలుగా జరడం లేదు. కొత్త జిల్లాలైన పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్‌ ఆఫీసు, బాపట్ల జిల్లా బాపట్ల డివిజన్‌ ఆఫీసులో ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల జీతాలు పడలేదట. విజయనగరం జిల్లా చీపురుపల్లి డివిజన్‌లోనూ ఇదే పరిస్థితిని సిబ్బంది ఎదుర్కున్నారు. చిత్తూరు జిల్లా నగరి, కుప్పం, పలమనేరు ఆర్డీఓలకు సైతం పై కారణాల వల్ల జీతాలు అందనే లేదు. ఉత్తరాంధ్రలోని బొబ్బిలి, చీపురుపల్లి ఆఫీసుల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ల కొనుగోలుకు కలెక్టర్ల దగ్గర నిధులు అందుబాటులో లేవు. తూర్పు, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, చిత్తూరు, అన్నమయ్య వంటి కొత్త జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలే ప్రభుత్వ సిబ్బందిని పీడిస్తున్నాయి. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో స్పందన హాలు, వీసీ హాలు, ఇంకా ఇతర కలెక్టరేట్లలో అనేక చోట్ల ప్రధాన ఆఫీసు భవనాలకు జనరేటర్‌ సౌకర్యం లేదు.
*ప్రొటోకాల్‌ అధికారులూ తగినంత మంది లేరు
ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ప్రముఖులు అధికార పర్యటనలపై వచ్చే విశాఖపట్నం వంటి నగరాల్లో అవసరాలకు తగినంత మంది ప్రొటోకాల్‌ అధికారులు ఇప్పుడు ఈ పునర్విభజనతో లేకుండా పోయారు. దీంతో ఈ సమస్యను తాత్కాలికంగా అధిగమించడానికి స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్ల చేత ఈ ప్రొటోకాల్‌ పనులు చేయిస్తున్నారు. భూమి వివాదాలు ఎక్కువగా నలిగే విశాఖపట్నం కలెక్టరేట్‌లోని నాలుగు సెక్షన్లూ ఇతర పనులు కూడా చూడాల్సి వస్తోంది. ఒక జిల్లా కలెక్టర్‌ ఇతర రెండు జిల్లాలకు నోడల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉదాహరణకు విశాఖ కలెక్టర్‌ సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల నోడల్‌ అధికారిగా ఉంటూ అక్కడి సర్వీసు వ్యవహరాలు, పెన్షన్‌ ప్రతిపాదనలు పరిశీలించడం కష్టంగా ఉంది. ఇకపోతే, అనేక ప్రభుత్వ విభాగాల్లో ఉన్నతాధికారుల కొరత కారణంగా ఒకే అధికారి అనేక బాధ్యతలు తీవ్ర ఒత్తిళ్ల మధ్య నిర్వహించాల్సి వస్తోంది. అనేక కొత్త జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ శాఖకు అనుబంధంగా ఉన్న పలు విభాగాల అధికారులుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదాహరణకు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి, పుత్తూరు, గూడూరు డివిజన్ల ఇతర విభాగాల అధికారిగా కూడా బాధ్యతలు నెట్టుకొస్తున్నారు.
*అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయ్‌
ఎంతో కీలకమైన పాలనలో ప్రజలకు అవసరమైన అనేక ప్రభుత్వ పోస్టులు అధికారులు లేక పలు కొత్త జిల్లాల్లో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలు బెడితే–శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల జీఎం, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్‌ వంటి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొరుగునే ఉన్న ఆదీవాసీ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనేక విభాగాల అధికారుల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. కొన్ని జిల్లాల కొన్ని విభాగాల్లో ఒకే అధికారి రెండు జిల్లాల్లో విధులు నిర్వర్తించడం సర్వసాధారణంగా మారింది. అనేక జిల్లాల్లో డెప్యూటీ తహసీల్దార్ల పోస్టుల నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్ల ఉద్యోగాల వరకూ సిబ్బంది లేక ఖాళీగా ఉన్నాయి. వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉండే విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తగినంత సిబ్బంది లేరు. అలాగే ప్రభుత్వ విభాగాల నియంత్రణలో తగినన్ని వాహనాలు కూడా లేవు. అనేక జిల్లాల ఆఫీసులను ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న కారణంగా ప్రభుత్వ ఖర్చులు కూడా పెరిగాయి. కొన్ని కొత్త జిల్లాల ముఖ్య పట్టణాల్లో అద్దెలు ఎక్కువ కావడంతో ప్రభుత్వ సిబ్బంది ఇంటి అద్దె అలవెన్సు పెంచాలని కోరుతున్నారు. గుంటూరు వంటి పాత ఉమ్మడి జిల్లాల నుంచి విడదీసిన కొత్త జిల్లాలు తమ ఆర్థిక అవసరాల విషయంలో పాత జిల్లాలపైనే ఆధారపడుతున్నాయి. పల్నాడు జిల్లాలోని అనేక విభాగాలు గుంటూరు జిల్లాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
*కొత్త జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో అన్నీ సమస్యలే
కొత్త జిల్లాల ముఖ్య పట్టణాల్లో అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాలకు తగినన్ని భవనాలు గాని గదులు గాని లేవు. కొన్ని కొత్త జిల్లాల అనేక విభాగాలు పాత జిల్లా ముఖ్య పట్టణంలోనే కొనసాగుతున్నాయి. కొన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కొత్త భవనాల్లో తమకు కేటాయించిన గదులకు తమ శాఖల పేర్లు మాత్రం పెట్టేసి, తమ పాత స్థావరాల్లోనే ఇంకా వారు పనిచేసుకుంటూ పోవడం విశేషం. పాత జిల్లా ముఖ్యపట్నం మచిలీపట్నంలో కూడా ప్రభుత్వ భవనాల కొరత తప్పడం లేదు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలైన అన్నమయ్య, నంద్యాల, పుట్టపర్తి, పల్నాడు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లా ముఖ్య పట్టణాలలో ఇలాంటి సమస్యలు వర్ణనాతీతం. అధికారులు సహా సిబ్బంది, నిధుల కొరత, భవనాలు, ప్రభుత్వ వాహనాలు తగినన్ని లేకపోవడం వంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టి తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కొత్త జిల్లాలు ప్రజలకు భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *