బతకడానికే కాదు.. భవిష్యత్తు కోసమూ వలసవాదమే
* ఉత్తరాంధ్ర విద్యార్థుల ఆవేదన
* ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రావడం లేదు
* డా. బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదు
* ఉత్తరాంధ్ర విద్యార్థులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయ భేటీ
‘నా తల్లిదండ్రులు బతుకు కోసం వలసలు వెళ్లి బతుకుతున్నారు… మేం చదువుల కోసం, భవిష్యత్తు వెతుక్కోవడానికి కూడా వలస వెళ్లాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది కేవలం నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే.. డిగ్రీ కాలేజీలు లేవు.. నైపుణ్య శిక్షణ కోసం ఐటీఐల్లో విద్య, మౌలిక వసతులు కనిపించవు. ఇంక మేం నాణ్యమైన విద్య కోసం ఏం చేయాలి..? నా చెల్లి రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారిణి. చదువుల్లో ఆణిముత్యం. కానీ సరైన కళాశాలలు లేక వేరే ఊరు పంపి చదివించలేక ఆమెకు 18 ఏళ్లకే పెళ్లి చేసేశారు.. ఆమె జీవితానికి, భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు..? చదువుకుందామంటే కళాశాలలు లేవు… పోనీ వ్యవసాయం చేసుకుందామంటే సరైన సాగునీటి వసతి లేదు. చెప్పడానికి మాత్రం వంశధార, నాగావళి, మహేంద్ర తనయ వంటి నదులు ఉన్నా, పారుదల లేక వెనుకపడ్డాం… మా జీవితాలకు ఎవరు సమాధానం చెప్తారు?’ అని శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజక వర్గానికి చెందిన యువకుడు, ప్రస్తుతం విజయవాడలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దిలీప్ కళ్యాణ్ సూటిగా పాలకులను ప్రశ్నించాడు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో శనివారం సాయంత్రం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విద్యార్థులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమకు ఎదురవుతున్న అనుభవాలను మనోహర్ గారి ముందు చెప్పుకొన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ సొమ్ము సకాలంలో అందడం లేదని, ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో చదువుతుంటే, మూడో సంవత్సరం ఫీజు రీయంబర్సుమెంట్ సొమ్ము వేస్తోందని వాపోయారు. దీనివల్ల కళాశాలల్లో సకాలంలో సర్టిఫికెట్లు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదని శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వసతి గృహల్లో బురద నీరులాంటి చారు తాగాల్సి వస్తోందని, యువతులకు సైతం సరైన వసతులు లేవని చెప్పారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం ఇష్టానుసారం పథకాలకు పేర్లు పెట్టకూడదు.. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో సొమ్ము ఇస్తున్నట్లు అన్ని పథకాలకు పేర్లు పెట్టి, ప్రజా ధనం వృధా చేస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
* బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిండా సమస్యలే
శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్ కు ఎక్కువ విశ్వవిద్యాలయానికి తక్కువ అయినట్లు తయారు అయిందని విద్యార్థులు శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. యూనివర్సిటీలో కనీసం 20 శాతం కూడా రెగ్యులర్ ఫ్యాక్టరీలు లేరని, కనీస వసతులు సౌకర్యాలు మాటే లేదని చెప్పారు. ముఖ్యంగా ఉప కులపతి దారుణంగా వ్యవహరిస్తున్నారని, కులాలవారీగా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. ప్రశ్నిస్తే విద్యార్థులను నానా రకాలుగా బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
*బలమైన విధానం తీసుకొస్తాం
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉద్దేశించి శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర యువత అభివృద్ధి మీద ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇష్టానుసారం దాడులు చేస్తున్నారు. విద్యాసంస్కరణలు విషయంలో విద్యను మరింత ఆధునికరించే విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది. పెడుతున్న ఖర్చు విద్యాభివృద్ధి కీ ఉపయోగపడటం లేదు. జనసేన ప్రభుత్వంలో దీనికి ఒక విధానం తీసుకుని వస్తాం. జనవరి 12వ తేదీన రణస్థలం లో జరిగే యువశక్తి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరిస్తారు” అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్ పాల్గొన్నారు.