ఇప్పటంలో ఇళ్లు కూల్చి వైసీపీ పైశాచికానందం పొందుతోంది

• శ్రీ జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకే ఈ కూల్చివేతలు
• మచిలీపట్నంలో సభకు భూములిచ్చిన రైతుల్ని భయపెట్టే కుట్ర ఇది
• శ్రీ జగన్ రెడ్డి నిజంగా సైకోనే
• 4 వేల జనాభా ఉన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరమా?
• వారాంతాల్లో కూల్చివేతలు కచ్చితంగా కక్ష సాధింపు చర్యే
• ఇప్పటం ఇళ్ల కూల్చివేతల్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోంది
• ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా జనసేన నిలుస్తుంది
• భీమవరంలో మీడియాతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేస్తూ వైసీపీ ప్రభుత్వం పైశానిక ఆనందం పొందుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు భూములు ఇచ్చిన రైతుల్ని భయపెట్టేందుకే ప్రభుత్వం మరోసారి ఇప్పటంలో కుట్రపూరితంగా కూల్చివేతలు మొదలుపెట్టిందన్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చే కార్యక్రమాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. వారాంతాల్లో కూల్చివేతలు కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనన్నారు. బాధితులు కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా ఈ విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. పెట్టుబడుల సదస్సు నేపధ్యంలో రెండు రోజుల పాటు రాజకీయ విమర్శలు చేయబోమన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని ఉదయం ఆరు గంటల నుంచే ఇప్పటం గ్రామం మీద పడ్డారని మండిపడ్డారు. శ్రీ జగన్ రెడ్డి నిజంగా సైకో సీఎమ్మే అన్నారు. మచిలీపట్నంలో జరిగే 10వ ఆవిర్భావ సభ విజయం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం భీమవరంలో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రజా సమస్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తారన్న నమ్మకంతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, శాసనసభ్యుడికి ఎదురు నిలచి ధైర్యంగా భూములు ఇచ్చినందుకు కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ఉపక్రమించింది. శ్రీ జగన్ రెడ్డి పైశాచికానందం కోసం, అతని కళ్ళలో ఆనందం చూసేందుకు ఇప్పటం గ్రామంలో మరోసారి ఇళ్లు కూల్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మాట్లాడితే ముఖ్యమంత్రి దమ్ముందా.. దమ్ముందా అని ప్రశ్నిస్తారు. దమ్ముంటే ఈ కూల్చివేతలు సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఎందుకు మొదలు పెట్టలేదు. శని, ఆదివారాల్లో ఎందుకు చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖ నిర్ణయం ఆ గ్రామస్థుల్ని వేధించేందుకు కాదా? కనీసం పరిపాలనా దక్షత లేదు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే 4 వేల జనాభా ఉన్న చిన్న రైత్వారీ గ్రామంలో… ఇప్పటికే 80 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని 120 అడుగులకు విస్తరిస్తామంటున్నారు. అసలు ఆ ఊరు వెళ్లేందుకు సరైన రోడ్డు కూడా లేదు. రాత్రింబవళ్లు వారిని భయబ్రాంతులకు గురి చేసి ఉదయం 200 మంది పోలీసుల సహకారంతో ఎవర్నీ ఇంటి నుంచి బయటకు రాకుండా భయపెట్టి, సంఘీభావం తెలిపేందుకు జనసేన నాయకులు ఎవరూ రాకుండా రోడ్లు మూసివేసి ప్రభుత్వానికి ఎందుకీ కర్మ పట్టింది.
• శాసనసభ్యుడి ఇంటి ముందు 140 అడుగుల రోడ్డు ఉందా?
నిన్నటి రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆదర్శవంతంగా పెట్టుబడుల సదస్సు నేపధ్యంలో ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం.. మన బిడ్డలకు ఉపాధి అవసరం కాబట్టి రాజకీయంగా ఎలాంటి విమర్శలు చేయొద్దన్న నిర్ణయం తీసుకుంటే మీరు పనిగట్టుకుని మహిళల్ని, రైతుల్ని వేధించే విధంగా ముందుకు వెళ్తున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి. యుద్ధం మీరు మొదలుపెట్టారు. రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వమే. వైసీపీ శాసనసభ్యులు మీరు చేసిన అన్యాయమైన కార్యక్రమాలు, ఎలాంటి అక్రమాలు చేశారో గుర్తుపెట్టుకోండి. శాసనసభ్యుడి ఇంటి ముందు 40 అడుగుల రోడ్డు ఉందా? 140 అడుగుల రోడ్డు ఉందా? మీరు ఇప్పటం మీద దేనికోసం కక్ష కట్టారు. మీ ముఖ్యమంత్రి కళ్లలో ఆనందం నింపేందుకా? పరిపాలనా దక్షత లేక ఇలాంటి అనవసరమైన కార్యక్రమాలకు సమయం వృథా చేస్తున్నారు. పచ్చటి గ్రామాల్లో మంటలు పెడుతున్నారు. ఇప్పటం గ్రామానికి వెళ్లడానికే రోడ్డు లేదు. గ్రామం మధ్యలో 140 అడుగుల రోడ్డు వేస్తామంటే ఎలా అర్ధం చేసుకోవాలి. ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కార్యక్రమాన్ని తక్షణం ఆపాలి.
• మచిలీపట్నం సభ వైసీపీకి చెంపపెట్టు కావాలి
స్థానిక శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికయ్యారో.. ప్రజల మీద కక్ష సాధించేందుకు గెలిచారో అర్ధం కావడం లేదు. మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నం వేదికగా నిర్వహిస్తున్నాం. అక్కడ రైతులు 34 ఎకరాల స్థలాన్ని సభ కోసం ఇచ్చి నిలబడ్డారు. వారిని భయపెట్టేందుకు చేసిన కక్ష పూరిత చర్య ఇది. శ్రీ జగన్ రెడ్డి…. యుద్ధం మీరు మొదలు పెట్టారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటం గ్రామస్తుల పక్షాన నిలబడుతుంది. ప్రతి జనసైనికుడు మీ పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం. అవసరం అయితే ఇక్కడి నుంచి అంతా కలసి ఇప్పటం గ్రామస్తుల కోసం వస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అండగా నిలబడతాం” అన్నారు.