ప్రభుత్వ కక్కుర్తి….పేదల కంటతడి!

* కేంద్రం పంపే ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేత‌
* స‌బ్సిడీ భారం త‌ప్పించుకునే య‌త్నం
* ధాన్యం సేక‌ర‌ణ ఆపేస్తామన్న కేంద్రం
* వ‌రి రైతుల్లో ఆందోళ‌న‌

మాది పేద‌ల ప్ర‌భుత్వం… పేద ప్ర‌జ‌ల‌కు క‌డుపు నిండా బువ్వ పెట్ట‌డ‌మే మా ధ్యేయం…
– ఇది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే వ‌ల్లించే చిల‌క ప‌లుకులు!
కానీ… పేద‌ల నోటి ద‌గ్గ‌ర ముద్ద‌ను సైతం లాగేసుకునేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ఉండ‌డం అస‌లైన వాస్త‌వం!
రేష‌న్ బియ్యం ఉచిత పంపిణీకి సంబంధించి వైకాపా ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలను ప‌రిశీలిస్తే ఇది ఇట్టే అర్థం అవుతుంది.
అస‌లు సంగ‌తి తెలియాలంటే ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్నయోజ‌న (పీఎమ్ జీ కేఏవై) అనే కేంద్ర ప‌థకాన్ని రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న తీరుతెన్నులు గ‌మ‌నించాలి. ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి తాజాగా వైకాపా ప్ర‌భుత్వం పెట్టిన మెలిక ఏంటో గ్ర‌హించాలి. దీనిపై కేంద్రం చేసిన హెచ్చరిక‌ను అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఈ వివాదం అటు పేద‌ల‌కు, ఇటు రైతుల‌కు ఎలా ఆందోళ‌న క‌లిగిస్తోందో తెలుసుకోవాలి.
ఇవ‌న్నీ తెలిస్తే పేద‌లకు అందాల్సిన బియ్యంపై సైతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎలాంటి రాజ‌కీయం ఉప‌యోగిస్తోందో అవ‌గ‌త‌మ‌వుతుంది. ఓ ప‌క్క ప‌థ‌కాన్ని నిలిపివేసి కూడా ప్ర‌జ‌ల‌ను ఎలా అబ‌ద్ధ‌పు ప్ర‌చారంతో మ‌భ్య‌పెడుతోందో తేట‌తెల్ల‌మ‌వుతుంది. చెప్పేదొక‌టి, చేసేదొక‌టిగా వ్‌ివ‌హ‌రించే జ‌గ‌న్ ప్రభుత్వం కుటిల‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టే ఈ వ్య‌వ‌హారం లోతుల్లోకి వెళ్లాలంటే పూర్వాప‌రాలేంటో ఓసారి చూడాలి.
* అరుదైన ప‌థ‌కంపై అంతులేని నిర్ల‌క్ష్యం
క‌రోనా నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయి విల‌విలలాడుతున్న పేద‌లకు ప్ర‌యోజ‌నం చేకూర్చాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆత్మ నిర్భ‌ర్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న‌యోజ‌న ప‌థ‌కాన్ని 2020 ఏప్రిల్ లో ప్రారంభించింది. దీని ప్ర‌కారం దేశ వ్యాప్తంగా పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ద్వారా అన్ని చౌక దుకాణాల నుంచి రేష‌న్ కార్డులు ఉన్న నిరుపేద‌ల‌కు ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమ‌లు, మ‌రో 5 కిలోల ప‌ప్పు దినుసులు అందిస్తారు. ఇలా దేశ‌వ్యాప్తంగా 81.35 కోట్ల మంది ప్ర‌జ‌లకు ఆక‌లి బాధ లేకుండా చేయాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యం. ఇందుకు దాదాపు రూ.1.7 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని మొద‌ట్లో అంచ‌నా వేశారు. అంటే కేంద్రం పంపించే బియ్యాన్ని దేశంలోని రాష్ట్రాలు చౌక దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయాలి. ఆ త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని పొడిగిస్తూ వ‌చ్చారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు 5 విడ‌తలుగా అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌థ‌కం ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆహార భ‌ద్రత కార్య‌క్ర‌మంగా నిలిచింది. దీని ద్వారా అమెరికా జ‌నాభాకు రెండు రెట్ల మంది, యూకే జ‌నాభాకు 12 రెట్ల మంది, యూర‌ప్ జ‌నాభాకు రెట్టింపు మంది పేద‌లు భార‌త దేశంలో ప్ర‌యోజ‌నం పొందుతార‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ మోన‌ట‌రీ ఫండ్ అంచ‌నా వేసింది. ఇంత‌టి అరుదైన ప‌థ‌కం అమ‌లులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌న‌డానికి అనేక దృష్టాంత‌రాలు ఉన్నాయి. ఈ ప‌థ‌కం మొద‌టి ద‌శ చివ‌ర్లో కేంద్ర ఆహార, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ చేసిన ప‌రిశీల‌న ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కేవలం ఒక్క శాతం క‌న్నా త‌క్కువ బియ్యం మాత్ర‌మే పంపిణీ అయింద‌ని తేలింది. స్ధానిక ప్ర‌భుత్వాల అవినీతి వ‌ల్ల‌నే ప‌థ‌కం నీరుగారుతోంద‌ని కేంద్రం దృష్టికి వ‌చ్చింది.
అప్ప‌ట్లో ‘‘కేంద్రం పేద‌ల కోసం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయ‌డంలో కూడా ఇంత‌టి నిర్య‌క్ష్యం మంచిది కాద‌’’ని సంబంధిత కేంద్ర మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు కూడా. ఆ త‌ర్వాత అయిదు విడ‌త‌లుగా ఈ ప‌థ‌కం ద్వారా బియ్యం పంపిణీ జ‌రిగింది.
* పేద‌ల కూటికి గండి
తాజాగా ఈ ప‌థ‌కాన్ని 2022 సెప్టెంబ‌రు వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఆరో విడ‌త పంపిణీకి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మోకాల‌డ్డింది. నాలుగు నెల‌లుగా ఈ ప‌థ‌కం ద్వారా పంపిణీ కావాల్సిన బియ్యాన్ని నిలిపివేసింది. దాంతో 2.68 కోట్ల మంది పేద‌ల‌కు రూ.2,051 కోట్ల విలువైన బియ్యం అంద‌కుండా పోయింది. అయితే ప్ర‌జ‌ల‌కు మాత్రం కేంద్రం బియ్యం స‌ర‌ఫ‌రా కాలేదంటూ మ‌భ్‌5పెట్టింది.
త‌మ‌ది పేద‌ల ప్ర‌భుత్వమంటూ గ‌ప్పాలు కొట్టుకునే జ‌గ‌న్ నిజ స్వ‌రూపం ఇద‌నే ఆరోప‌ణ‌లు విప‌క్షాల నుంచి సామాన్యుల వ‌ర‌కు వెల్లువెత్తినా వైకాపా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై ఎంపీ జీవిఎల్ న‌ర‌సింహారావు రాజ్య‌స‌భ‌లో తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం వెలిబుచ్చారు.
‘‘ ఇంత‌వ‌ర‌కు ఈ ప‌థ‌కం అయిదు ద‌శ‌ల ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 89 ల‌క్ష‌ల కుటుంబాల‌కు చెందిన 2.68 కోట్ల పేద‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది. దాదాపు 25 ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యం పంపిణీ జ‌రిగింది. ఇందుకు సంబంధించి రూ.5,500 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి విడుద‌ల చేసింది కూడా. అయినా ఇప్పుడు వైకాపా ప్ర‌భుత్వం ఆరో ద‌శ పంపిణీలో ఇంత‌వ‌ర‌కు ఒక్క బియ్యం గింజ‌ను కూడా పంపిణీ చేయలేదు. పైగా కేంద్రం, ఫుడ్ కార్పొరేష‌న్లు బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌లేదంటూ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తోంది. నిజానికి రాష్ట్రం ద‌గ్గ‌ర 14 ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యం నిల్వ‌లు ఉన్నాయి. ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి నెల‌కు 1.2 ట‌న్నుల బియ్యం స‌రిపోతాయి’’
అంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. పేద‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే, కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయ‌డంలో కూడా వైకాపా ప్ర‌భుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని, దీన్ని వెంట‌నే నివారించాల‌ని ఆయ‌న కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలో అన్న‌యోజ‌న ప‌థ‌కం కింద బియ్యం స‌ర‌ఫ‌రా వెంట‌నే చేయాల‌ని, లేక‌పోతే రాష్ట్రంలో ధాన్యం సేక‌ర‌ణ‌నే నిలిపి వేస్తామ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ హెచ్చ‌రించారు. దాంతో రాష్ట్రంలో వ‌రి సాగు చేసే రైతులు ఒక్కసారిగా ఉలిక్కి ప‌డ్డారు. కేంద్రం ధాన్యం సేక‌ర‌ణ నిలిపివేస్తే ఆ ప్ర‌భావం ల‌క్ష‌లాది మంది రైతుల‌పై ప‌డుతుంది. వాళ్లంతా ధాన్యం అమ్ముడుకాక తీవ్రంగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. కేంద్రం సేక‌రించ‌క‌పోతే మిల్ల‌ర్లు ధ‌ర‌ను త‌గ్గించేస్తారు. ఖ‌రీఫ్ సాగు మొద‌ల‌వుతున్న నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న రైతుల్లో క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది.
అంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వ‌ల్ల అటు పేద‌ల నోటి ద‌గ్గ‌ర ముద్ద దూర‌మ‌వ‌డంతో పాటు, ఇటు అన్న‌దాత‌లకు కూడా ఆవేద‌న క‌లుగుతోంద‌న్న‌మాట‌.
* వైకాపా ప్ర‌భుత్వం వింత మెలిక‌
కేంద్రం అందించే బియ్యాన్ని పంపిణీ చేయ‌డానికి కూడా అభ్యంత‌రం ఏమిట‌నే విష‌యాన్నిలోతుగా విశ్లేషిస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్కుర్తి వ్య‌వ‌హారం అర్థ‌మ‌వుతుంది. పేద‌ల ప్ర‌యోజ‌నాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఎలా నీచ రాజ‌కీయాలు ప్ర‌ద‌ర్శిస్తోందో తెలుస్తుంది. ఎలాగో తెలియాలంటే అస‌లు రేష‌న్ కార్డుల ద్వారా జ‌రిగే పౌర స‌ర‌ఫ‌రాల తీరుతెన్నులు అర్థం చేసుకోవాలి. దేశంలో ఆహార పౌర స‌ర‌ఫ‌రాల విధానాన్ని బ‌ట్టి మూడు ర‌కాల రేష‌న్ కార్డులు ఉంటాయి. బిలో పావ‌ర్టీ లైన్‌, ఎబౌ పావ‌ర్టీ లైన్‌, అంత్యోద‌య అన్న‌యోజ‌న విధానాల ద్వారా రేష‌న్ కార్డుల‌ను పంపిణీ చేస్తారు. జాతీయ ఆహార భ‌ద్రత చ‌ట్టం (2013) నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని కార్డుల ల‌బ్దిదారుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ సొంత విధానాల ద్వారా గుర్తించ‌వ‌చ్చు. అయితే అన్న‌యోజ‌న‌, నిరుపేద‌లకు సంబంధించిన రేష‌న్ కార్డుల ల‌బ్ది దారుల‌ను కేంద్రం సూచించే నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి గుర్తించాల్సి ఉంటుంది. అలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మొత్తం 1.45 కోట్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం కింద కేంద్రం రాయితీపై నిత్యావ‌స‌రాలను ఇచ్చే కార్డులు 61 శాతం వ‌ర‌కు ఉన్నాయి. వీటి ద్వారా చౌక ధ‌ర‌ల‌కు అందించే స‌రుకుల‌కు సంబంధించిన స‌బ్సిడీని కేంద్ర‌మే భ‌రిస్తుంది. మిగిలిన కార్డుల ద్వారా అందించే స‌రుకుల‌కు సంబంధించిన రాయితీ భారాన్ని రాష్ట్రాలే భ‌రించాలి. ఆంధ్రాలో 88.75 ల‌క్ష‌ల కార్డుల‌కు సంబంధించిన 2.68 కోట్ల మంది పేద‌లు జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం ప‌రిధిలోకి వ‌స్తారు. రాష్ట్రం గుర్తించిన 56.71 ల‌క్ష‌ల కార్డుల ప‌రిధిలో 1.57 కోట్ల మంది ఉన్నారు. వీళ్ల‌కి బియ్యం స‌ర‌ఫ‌రా చేయాలంటే నెల‌కు రూ. 270 కోట్ల భారం భ‌రించాల్సి ఉంటుంది. కేంద్రం అన్న‌యోజ‌న ప‌థ‌కం ఆరో ద‌శ‌లో ఆరు నెలల‌కు రూ. 1,620 కోట్ల రూపాయ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మోయాల్సి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్డుల‌నూ జాతీయ ఆహార భ‌ద్రత చ‌ట్టం కింద‌కు తీసుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది ఖ‌రారు కాక‌పోవడంతో కేవ‌లం రాయితీ భారాన్ని త‌ప్పించుకోవాల‌నే క‌క్కుర్తితో మొత్తం ప‌థ‌కానికే గండి కొట్ట‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌ప‌డింది. ఇందువ‌ల్ల పేద‌లు బియ్యం అందుకోలేక‌పోయారు స‌రికదా, రేష‌న్ డీల‌ర్లు ఆరునెల‌ల్లో దాదాపు రూ. 180 కోట్ల క‌మిష‌న్‌ను కూడా కోల్పోయారు.
ఇలా రాయితీ సొమ్మును మిగుల్చుకోవ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేద‌ల‌ను, రైతుల‌ను, డీల‌ర్ల‌ను సైతం ఆవేద‌న‌కు గురి చేస్తోంది. త‌మ‌ది పేద‌ల ప్ర‌భుత్వమంటూ ప‌దే ప‌దే చెప్పుకునే జ‌గ‌న్ వాస్త‌వంలో పేద‌ల ప్ర‌యోజ‌నానికే గండి కొట్ట‌డాన్ని ఇప్పుడు సామాన్యులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు.