గల్ఫ్ దేశాల్లోని ఎన్.ఆర్.ఐ. కార్యకర్తల అంకితభావం అమూల్యమైనది

* జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు తరాలకు భద్రత చేకూరుతుందనే పట్టుదలతో పనిచేస్తున్న గల్ఫ్ దేశాల ఎన్.ఆర్.ఐ. కార్యకర్తల అంకితభావం అమూల్యమైనదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. దుబాయ్ పర్యటనలో భాగంగా శుక్రవారం అజ్మాన్ నగరంలోని మైత్రీ ఫాంలో జరిగిన గల్ఫ్ దేశాల ఎన్.అర్.ఐ. కార్యవర్గ సభ్యుల సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. వృత్తి, వ్యాపారం పరంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభూమిపై మక్కువతో, ప్రజా ప్రయోజనాల కోసం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే తపనతో గల్ఫ్ దేశాల ఎన్.ఆర్.ఐ. కార్యకర్తలు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ఎన్.అర్.ఐ. కార్యకర్తలకు పార్టీలో గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆస్ట్రేలియా ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీర మహిళల సమన్వయకర్త శ్రీ కొలికొండ శశిధర్ ఎన్.అర్.ఐ. కార్యకర్తల విధి విధానాలను గురించి వివరించారు.
* “దుబాయ్ – యూఏఈ” జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
అజ్మాన్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన “దుబాయ్ – యూఏఈ” జనసేన పార్టీ కార్యాలయంను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యాలయంలో గల్ఫ్ జనసేన హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. శ్రీ కేసరి త్రిమూర్తులు, శ్రీ చందక రామదాసు, శ్రీ కంచన శ్రీకాంత్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలలో స్థిరపడిన జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.