ఎస్సీ, ఎస్టీలకు వైకాపా వంచన

* వాగ్దానాలు నెరవేర్చని జగన్‌ ప్రభుత్వం
* ఉన్న పథకాలకూ మంగళం
* స్వయం ఉపాధి రుణాలు హుళక్కి
* విద్యా, శిక్షణ కార్యక్రమాలు నాస్తి
* చెప్పేదొకటి చేస్తున్నదొకటి
* కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం
* ఉద్యమ బాటలో బాధితులు

సమాజంలో వాళ్లు…
అణగారిన వాళ్లు… వెనకబడిన వాళ్లు… అభివృద్ది ఫలాలు అందుకోని వాళ్లు…
అయినా వాళ్లు…
ఓటు ఉన్న వాళ్లు… దాన్ని ఉపయోగించగలిగే వాళ్లు… ఎన్నికలను ప్రభావితం చేయగలిగే వాళ్లు…
అందుకే వాళ్లు…
పావులుగా మారిన వాళ్లు… దగాపడిన వాళ్లు… వంచనకు గురయిన వాళ్లు!
వాళ్లెవరో కాదు… షెడ్యూల్డ్‌ కులాల వాళ్లు! షెడ్యూల్డ్‌ తెగల వాళ్లు!
ఎస్సీలు, ఎస్టీలైన వీళ్లందరూ వైకాపా కల్లబొల్లి మాటల వలలో చిక్కుకుని ఇప్పుడు విలవిలలాడుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీళ్లంతా ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు…’ అనే పలుకులు విన్నారు.
‘వాళ్ల అభ్యున్నతి కోసమే నా తపనంతా…’ అనే మాటలు ఆలకించారు.
‘వాళ్ల బతుకుల్ని మార్చేస్తా…’ అనే హామీలతో మురిసిపోయారు.
ఆ మాటలు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పటివి. ఊరూవాడా తిరుగుతూ ‘ఒక్క ఛాన్స్‌…’ అని వేడుకున్నప్పటివి.
ఆ పలుకుల్ని, హామీల్ని వాళ్లు నమ్మారు.
తర్వాత వాళ్లు ఆంధ్రా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆపై జగన్‌ ముఖ్యమంత్రి కావడాన్ని కళ్లారా చూశారు.
కానీ… వాళ్ల కళ్ల ముందే ఇప్పుడు మూడున్నరేళ్లు గడిచి పోయాయి. మళ్లీ ఎన్నికలు కూడా ముంగిట్లోకి వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు వాళ్లు తేరుకుని చూసుకునే సరికి తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందనే సంగతి అర్థమైంది. అధికారం కోసం ఆడిన కల్లబొల్లి మాటల్లో నిజమెంతో అర్థమైంది. ఎన్నికలకు ముందు కురిపించిన ప్రేమంతా కపటత్వమని బోధపడింది. వంచన తప్ప ఒరిగిందేమీ లేదని తెలిసింది.
అందుకే ఇప్పుడు వాళ్లు ఎలుగెత్తి నినదిస్తున్నారు. పిడికిళ్లు బిగిస్తున్నారు. ఉద్యమిస్తున్నారు.
వాళ్లు ఎందుకు ఉద్యమిస్తున్నారో తెలియాలంటే… అసలు వాళ్లకి ఉన్న పథకాలేంటో, వైకాపా హామీలేంటో, ఇప్పడు వారికి జరుగుతున్న వంచనేంటో అర్థం చేసుకోవాలి.
* కపట ప్రేమకు గీటురాళ్లివిగో…
* ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. లక్ష కోట్ల రూపాయలను వారి కోసం ఖర్చు చేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా గోచరిస్తోంది. అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలనే వారికీ వర్తింపజేస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదనేది చేదు వాస్తవం. పైగా దశాబ్దాలుగా వారి కోసం అమలవుతున్న 27 పథకాలకు జగన్‌ ప్రభుత్వం మంగళం పాడింది.
* నిరుపేద ఎస్సీల కోసం కేంద్రం సహకారంతో భూమి కొనుగోలు పథకాన్ని దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ఆమలు చేశాయి. ఒక్కో కుటుంబం ఎకరం పొలం కొని, సాగు చేసేందుకు తోడ్పడ్డాయి. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక గ్రాంటుగా 70 శాతం రాయితీ ఇవ్వగా, జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ 30 శాతం రుణంగా ఇచ్చేది. మూడు దశాబ్దాలుగా వేలాది మందికి అండగా నిలిచిన ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. 2019 బడ్జెట్‌లో రూ.85 కోట్లు కేటాయించినా ఒక్క ఎకరమూ కొనివ్వలేదనేది కఠోర వాస్తవం.
* రాష్ట్రం జనాభాలో ఎస్సీలు18 శాతం, ఎస్టీలు 15 శాతం ఉన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద కేటాయించే నిధులను ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న కాలనీలు, తండాల్లో రహదారులు, తాగునీరు, మురుగు కాల్వలు వంటి అభివృద్ధి పనుల కోసం కేటాయించాలి. యువత పరిశ్రమలను స్థాపించుకునేలా ప్రోత్సహకాలు ఇవ్వాలి. ఇందుకు గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌ పేరుతో 30 శాతం నిధుల్ని వినియోగించగా వైకాపా ప్రభుత్వం ఉపప్రణాళిక నిధులను కూడా నవరత్నాల్లో కలిపేసింది. అందరికీ ఇచ్చే ఉపకార వేతనాలు, పించన్లను ఉపప్రణాశిక నిధులుగా లెక్క చూపిస్తున్నారు.
* కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ అందించే రుణాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేంద్ర నిధులకు జతగా తన వాటాను కలపడం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే వాటిలో 60 శాతం కేంద్ర సంస్థలు ఇస్తుండగా 35 శాతం నిధులను రాష్ట్రం జత చేయాలి. కానీ రాష్ట్రం తన వాటా ఇవ్వకపోగా ఆ పథకాలనే నిలిపివేసింది.
* ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించేందుకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని గతంలో అమలు చేసేవారు. 2 నుంచి 10వ తరగతి వరకు పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్చించేవారు. ఆ ఖర్చును ప్రభుత్వాలే భరించేవి. జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్నికేవలం 9, 10 తరగతుల వారికి మాత్రమే పరిమితం చేసింది. పైగా ఆ విద్యార్థులకు అందించాల్సిన బకాయిలను కూడా సరిగా చెల్లించడం లేదు. దాంతో లక్షలాది మంది పిల్లలకు ఈ పథకం ఫలితాలు సక్రమంగా అందడం లేదు.
*ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన విదేశీ విద్య పథకాన్ని వైకాపా ప్రభుత్వం మూడేళ్లపాటు దూరం చేసింది. ఆఖరికి వివిధ సంఘాల ఒత్తిడితో తిరిగి అమల్లోకి తెచ్చినా అర్థం పర్థం లేని కొత్త నిబంధనలతో కొర్రీలు పెడుతోంది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లోని కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అందుకునే అవకాశం దూరమైంది. కేవలం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాల్లో మాత్రమే సీట్లు సంపాదించాలనే నిబంధనే ఇందుకు ప్రధాన కారణం.
* పేదల ఆర్థికాభివృద్ధికి కీలకమైన స్వయం ఉపాధి రుణాలను సైతం వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా వర్గాల వెన్నువిరిచింది. గతంలో స్థాపించే యూనిట్‌ ను బట్టి 40 నుంచి 90 శాతం వరకు రాయితీతో రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలుగా ఇచ్చేవారు. ఏటా వేల మంది లబ్ది పొందేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2019లో ఈ పథకానికి 3.15 లక్షల మంది ధరఖాస్తు చేసుకోగా, వీరికి ఒక్క పైసా రాయితీ రుణం ఇవ్వలేదు. అసలు ఈ ఉపాధి రుణాల ప్రక్రియనే పక్కన పెట్టేశారు.
* గతంలో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భరోసాగా నిలిచిన స్టడీ సర్కిళ్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చింది. బ్యాంకు, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, డీఎస్సీ, గ్రూప్స్‌ తదితర పరీక్షలకు సిద్ధమయ్యే యువత వీటిలో ఉచితంగా శిక్షణ తీసుకునేది. వైకాపా ప్రభుత్వం తిరుపతి స్టడీ సర్కిల్‌ను బ్యాంకు కోచింగ్‌కు, విశాఖలోని కేంద్రాన్ని సివిల్స్‌ కు, విజయవాడ కేంద్రాన్ని గ్రూప్‌ పరీక్షలకు పరిమితం చేసింది. దీనికి సాయం విజయవాడలోని శిక్షణ కేంద్రంలో భవన మరమ్మతుల పేరిట రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసింది. గతంలో ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా సివిల్స్‌ శిక్షణ అందగా వైకాపా సర్కారు వీటినీ ఎత్తివేసింది.
* కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్రం రూ. 2.50 లక్షల వంతును ఆర్థిక సాయం చేసే పథకాన్ని కూడా జగన్‌ సర్కారు నీరుగార్చేసింది. మూడేళ్లుగా కేంద్రం అందిస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లించిన ఘనత వైకాపాదే.
* వీటన్నింటికి సాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* ప్రచారం కోసం ఎస్సీఎస్టీల వారికి కొన్ని పదవులు కేటాయించినా అధికారాలు లేకుండా చేస్తున్నారనేది మరో బలమైన ఆరోపణ.
*ఎలుగెత్తి నినదిస్తున్న సంఘాలు…
వైకాపా వైఖరికి విసుగెత్తిపోయిన ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఇప్పుడు ఎలుగెత్తి నినదిస్తున్నాయి. ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో జగన్‌ ను పదవి నుంచి సాగనంపకపోతే రాష్ట్రంలో సామాజిక న్యాయం మంటగలిసిపోతుందని ఈ సంఘాల నేతలు పిడికిళ్లు బిగిస్తున్నారు. దళిత, గిరిజన ఐకాస చైర్మన్‌ గోపాలరావు, ఏపీ ఎమ్మర్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేత అంజయ్య, ఐకాస కార్యనిర్వాహక చైర్మన్‌ పనబాక కృష్ణయ్య, ఆదివాసీ గిరిజన సంఘాల జాతీయ సలహాదారు కొండలు, బహుజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, దళిత బహుజన ఫ్రంట్‌ మహిళా కార్యదర్శి వేల్పుల జ్యోతిలాంటి నేతల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఉద్యమబాట పడుతున్నారు.
ఇంత జరుగుతున్నా వారి నిరసన గళాలను పట్టించుకోవడం లేదంటే…
రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించే ప్రయత్నం చేయడం లేదంటే…
నీరుగార్చిన పథకాల ద్వారా ఎస్సీఎస్టీలకు మేలు చేకూర్చడం లేదంటే…
అణగారిన వర్గాల వారికి భరోసా ఇచ్చే చర్యలు చేపట్టడం లేదంటే…
కారణాలు వేరే వెతకక్కర లేదు.
ఎందుకంటే… జగన్‌ ప్రభుత్వానిది ఏరు దాటగానే తెప్ప తగలబెట్టే తీరు!
ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లననీ, ఓడ దిగాక బోడి మల్లన్ననీ అనే తీరు!
వెరశి… ఓట్ల కోసం వరాల ఎర వేసే వైఖరి! ఆఖరికి నమ్మించి వంచన చేసే వైఖరి!!