జన సైనికుల శ్రేయస్సే పార్టీ విధానం

* కార్యకర్తలకు బీమా చేయించడం శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం
* మృతి చెందిన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించిన శ్రీ నాదెండ్ల మనోహర్

భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించిన గొప్ప పార్టీ జనసేన అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. తెనాలిలోని లింగారావు బజార్ ప్రాంతానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ పులిగెండ్ల సుబ్రహ్మణ్యం ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబాన్ని శ్రీ మనోహర్ గారు పరామర్శించారు. రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కుని శ్రీ సుబ్రహ్మణ్యం భార్య శ్రీ పార్వతికి అందజేశారు. స్టీల్ దుకాణంలో పని చేసే శ్రీ సుబ్రహ్మణ్యం పార్టీ కోసం తన వంతు కష్టపడ్డారని ఆయనను కోల్పోవడం బాధకరమైన విషయం అని శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కష్టపడి పనిచేస్తూ పార్టీ కోసం తన వంతుగా పని చేసే శ్రీ సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు పార్టీకి దూరం కావడం దురదృష్టం. కార్యకర్తల్లో భరోసా నింపడానికి, వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వడానికి జనసేన పార్టీ చేపట్టిన బీమా పథకం ఆపదలో ఆదుకుంటుంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారి శ్రేయస్సు గురించి ఆలోచించిన గొప్ప మనసు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. ఇంటి పెద్దను కోల్పోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయలేదు. శ్రీమతి పార్వతికి ఫించను కూడా నమోదు చేయలేదు. ప్రభుత్వ అసమర్థత ప్రజలకు శాపంగా మారుతోంది. శ్రీ సుబ్రహ్మణ్యం ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు బీటెక్ చదువుతూనే చిన్నపాటి పనులు చేస్తూ ఇంటికి ఆసరా అవుతున్నాడు. ఫీజులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పేదవారికి అండగా నిలబడని ప్రభుత్వం ఎందుకు? వారి కుటుంబ బాధ్యతలను జనసేన పార్టీ తీసుకుంటుంది. కచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్యం ఇద్దరు కుమారులను చక్కగా చదివిస్తాం” అన్నారు.