పార్వతీపురం మన్యం జిల్లా ప్రశాంతతకు మారుపేరు కావాలి

  • నాటుసారా, గంజాయి, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నివారణకు చర్యలు చేపట్టాలి
  • దౌర్జన్యాలు, దొంగతనాలు, కబ్జాలను కట్టడి చేయాలి
  • అల్లర్లు, గొడవలు లేకుండా చూడాలి
  • జిల్లా ఎస్పీని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా ప్రశాంతతకు మారుపేరు కావాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్ ను శనివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, బంటు శిరీష్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, రౌతు బాలాజీ నాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జిల్లాలోని లా అండ్ ఆర్డర్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అధిక ప్రాంతం ఒడిశా కు సరిహద్దుగా ఉండటం వలన నాటు సారా, గంజాయి రవాణా జరుగుతోందన్నారు. దానిని అరికట్టాలని కోరారు. నాటుసారా గంజాయికి అలవాటు పడినవారి కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయన్నారు. జిల్లాలో వేసవి వచ్చిందంటే రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉంటాయని రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దానిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, దొంగతనాలు, కబ్జాలను అరికట్టాలన్నారు. జిల్లాలో గొడవలు, అల్లర్లు లేకుండా చూడాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో, కళాశాలల ప్రాంగణాల్లో ఆకతాయుల ఆగడాలను అరికట్టాలన్నారు. చీకటి పడ్డాక ఊరి పొలిమేరల్లో మందుబాబుల ఆగడాలను నియంత్రించాలన్నారు. దొంగతనాలపై దృష్టి సారించాలన్నారు. మహిళల మెడలో చైన్ల దొంగతనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ఆయా సమస్యలపై దృష్టి సారించి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించి, పార్వతీపురం మన్యం జిల్లాను ప్రశాంతతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆయా సమస్యలపై దృష్టి సారించి తగు చర్యలు చేపడతామన్నారు.