వరద ఉధృతిలో 30మంది గల్లంతు బాధాకరం: పవన్ కళ్యాణ్

భారీ వర్షాల కారణంగా కడప జిల్లా చెయ్యేరులో 30 మంది గల్లంతవడం పట్ల పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా కడప జిల్లాలో చెయ్యేరు నది వరదలో 30 మంది గల్లంతయ్యారనే సమాచారం బాధాకరం. వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని చెయ్యేరు లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొని  ఉంది. శివాలయంలో దీపారాధనకు వెళ్ళిన భక్తులు, పూజారి వరదలో చిక్కుకొని గల్లంతయ్యారు.

ఇంతగా వరద ఉధృతి ఉంటుందని, అన్నమయ్య జలాశయం మట్టికట్ట పరిస్థితిని అధికార యంత్రాంగం ముందుగా అంచనా వేసి, ప్రజానీకాన్ని అప్రమత్తం చేసి ప్రజల్ని ఆ మేరకు అప్రమత్తం చేస్తే ఈ ఘటన జరిగుండేది కాదని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న జల విలయం కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. రైతాంగానికి కోలుకోలేని విధంగా నష్టం వాటిల్లింది. తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో వరదల మూలంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. తిరుపతి నగరంలో పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయని, రహదారులు చెరువుల్లా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వందల గ్రామాలు వరద ముప్పునపడి ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల నెలకొన్న పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల జనసేన నాయకుల నుంచి పార్టీ కార్యాలయం సమాచారం తీసుకొంటోంది. ప్రభుత్వం తక్షణమే ప్రజలను వరదల నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. సాయంలో ఉదారంగా వ్యవహరించాలి. వారిలో భయాందోళనలు తొలగించేలా ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం చేరవేయడం కూడా ఎంతో అవసరం. వరదల మూలంగా ఇబ్బందిపడుతున్నవారికి సాయంగా నిలవాలని జనసేన నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను.