త్వరలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన

* జనసేన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది
* జనసేన తెలంగాణ విభాగ నాయకుల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ నాయకులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి చాలా మక్కువ. ఈ ప్రాంత పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలు స్వయంగా చూశారు. ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసు. అందుకనే ఆదిలాబాద్ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కోరుకుంటే నాయకత్వం రాదు. దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడాలి. ఒక ప్రణాళికతో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై గళం వినిపించాలి. అప్పుడు సమస్యలపై అవగాహన పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది.
* వారిని ఆదుకోవడం మన బాధ్యత
చౌటుప్పల్, హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన సైదులు, కడియం శ్రీనివాస్ అనే జనసైనికులు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి మనతో పాటు ఇన్నాళ్లు ప్రయాణించారు. ఇటీవల ప్రమాదవశాత్తు వాళ్లిద్దరు మరణించారు. ఆ కుటుంబాలను ఆదుకొని, వారికి భరోసా కల్పించే బాధ్యత మనపై ఉంది. మరో వారం పది రోజుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ కుటుంబాలను పరామర్శించి, బీమా సాయం అందిస్తారు. జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల పట్టులేదని అంటున్నారు. వాళ్లకు మన బలం గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సరిహద్దు ప్రాంతాలే కాదు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో బలమైన కార్యకర్తలు, జనసైనికులు ఉన్నారు. ఆయన చేసిన మంచి పనులు, రాజకీయాల్లో మార్పు కోసం పడుతున్న తపన చూసి యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. అయితే ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే మాత్రం జనసేన పార్టీ కార్యక్రమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాం తప్ప ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసే పార్టీ మాత్రం కాదు.
* క్షేత్రస్థాయిలో బలపడేలా చేద్దాం
గత సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేద్దామని భావించి కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్ధులను పోటీకి నిలబెడితే దాదాపు లక్షన్నర ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే బలమైన ఓటు బ్యాంకే సాధించాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అదే విధంగా చేపట్టాలి. క్రియాశీలక సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా వివరించాలి. నల్గొండ జిల్లాలో 13 వందల సభ్యత్వాలు నమోదయ్యాయి. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా సభ్యత్వాలు నమోదయ్యేలా అందరు కలసికట్టుగా కృషి చేయాలని” కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జ్ రాధారాం రాజలింగం, నల్గొండ జిల్లా ఇంఛార్జ్ సతీష్ రెడ్డి, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.రామారావు, తెలంగాణ వీర మహిళ విభాగం ఛైర్మన్ శ్రీమతి కావ్య, పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ వంగ లక్ష్మణ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.