అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

* ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైంది?
* రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి

రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మేళ్లవాగుకి చెందిన మేడబోయిన రామకృష్ణ, నంద్యాల జిల్లా హరివరం గ్రామస్తుడు వెంకటేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా హోసూరుకి చెందిన ఉప్పర తిక్కయ్య పంట నష్టాలతో, అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. చిన్నపాటి కమతాలు ఉన్నా ప్రధానంగా కౌలు వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలి. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన వ్యవస్థలు, సంబంధిత అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించకూడదు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రీ మెన్ కమిటీ సత్వరమే స్పందించాలి. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలి. అయితే ఆ విధులు నిర్వర్తించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి. వైసీపీ నాయకత్వం ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పంట పెట్టుబడిగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రచారం చేశారు. ఇప్పటి వరకూ ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారు? అసలు ఆ హామీ ఏమైంది? రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పంట అమ్ముకొన్నా సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టుబడి లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. కౌలు రైతులకు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులను అప్పుల భారం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. పంటకు పెట్టుబడి లేదు, రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వరు… ఏ దశలోనూ వైసీపీ రైతులకు అండగా నిలబడటం లేదు. ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటే అన్నం పెట్టే రైతులను కూడా కులాలవారీగా విభజించటమే. జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోంది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికీ రూ.7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుంది. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తాం అని జనసేనాని స్పష్టం చేశారు.