వివేక్ మృతికి సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ

తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వివేక్ హఠాన్మరణం అభిమానులని, సెలబ్రిటీలను, శ్రేయోభిలాషులను షాక్‌కు గురి చేసింది. నటుడిగానే కాకుండా సామాజిక వేత్తగా, పర్యావరణ సంరక్షుడిగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు వివేక్. హెల్దీ కామెడీతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన వివేక్ టీవీ హోస్ట్‌గా అబ్దుల్ కలాం, ఎ.ఆర్‌.రెహమాన్ వంటి వారితో అద్భుతమైన ఇంటర్వ్యూలను చేసి మెప్పు పొందారు.

వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్‌ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్‌, ఏఆర్‌. రెహమాన్‌, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్‌, జీవా, సమంత, ధనుష్‌, విజయ్‌, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ద్వారా వివేక్‌కు సంతాపం తెలియజేశారు. వివేక్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని కామిక్ టైమింగ్, ఇంటిలిజెంట్ డైలాగ్స్ ప్రజలను ఎంతగానో అలరించాయి సినిమాల్లోను, జీవితంలోను పర్యావరణం, సమాజం పట్ల చూపించిన అంకిత భావం చాలా గొప్పది. అతని అభిమానించే వారికి, కుటుంబ సభ్యులకు , స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.