అగ్రనేతలతో రహస్య భేటిలకు ప్రాధాన్యం.. ఆసక్తి కలిగిస్తున్న కేసీఆర్ ఢిల్లీ టూర్

మొన్నటిదాకా కేంద్రంపై గరం గరం గా వ్యవహరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ సడెన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకొని మోడీషాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా నిన్న అమిత్ షాను కలిసి చర్చలు జరిపిన కేసీఆర్ ఇక ఈరోజు మోడీతోనూ భేటికి రెడీ అవుతున్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ఆపార్టీపై కేసీఆర్ కారాలు మిరియాలు నూరారు. టార్గెట్ చేసి ఫెడరల్ ఫ్రంట్ దిశగా వెళ్లారు. కానీ ఏమైందో కానీ మళ్లీ సడెన్ గా రూటు మార్చి ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని పెద్దలను శరణు వేడడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

విశేషం ఏంటంటే.. కేసీఆర్ ఇలా ఢిల్లీ వెళ్ళీ వెళ్లగానే అలా అపాయింట్ మెంట్లు దొరుకుతున్నాయి. అదే ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఎదురుచూపులు చూసిన తర్వాతే ఆయనకు అపాయింట్ మెంట్లు దొరుకుతుండగా.. కేసీఆర్ కు మాత్రం గంటా, రెండు గంటల్లోనే దొరుకుతుండడం విశేషంగా మారింది. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఢిల్లీ వెళ్లారని సమాచారం. లీక్ కాకుండా ముందస్తుగానే పక్కాగా అపాయింట్ మెంట్లు ఖరారు చేసుకొని ఢిల్లీ చేరుకున్నట్టు తెలిసింది.

ముందుగా కేంద్రమంత్రి షెకావత్ తో భేటి అయ్యి ఆ తర్వాత అమిత్ షాతో భేటి అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే ఏఏ అంశాలపై చర్చించారో మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం ఆసక్తిగా మారింది. రాష్ట్ర సమస్యలు, వరద సాయంపై చర్చించారని టీఆర్ఎస్ చెబుతోంది. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీ అగ్రనేతలతో ఏకాంత సమావేశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్ర సమస్యలైతే అధికారులు, మంత్రులు తన వెంట ఉండేవారు. కానీ ఈసారి వారిని ఎవరిని కేసీఆర్ ఢీల్లీకి తీసుకెళ్లలేదు. కొద్దిమంది అధికారులకే తీసుకెళ్లారు. వారిని సమావేశాల్లో తీసుకుపోలేదు.

అమిత్ షాతో దాదాపు గంట సేపు కేసీఆర్ ఏకాంతంగా భబేటి అయ్యారని తెలిసింది. ఇటీవల బీజేపీని తీవ్రంగా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో రహస్య భేటిలు ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఢిల్లీ పెద్దలకు లొంగిపోయారా? అన్న టాక్ నడుస్తోంది.

దీన్ని బట్టి తెలంగాణపై బీజేపీ దండయాత్ర.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రభావం సీఎం కేసీఆర్ లో మార్పు తెచ్చిందని.. అందుకే ఆయన ఢిల్లీ పెద్దలతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుండడంతో బీజేపీతో సయోధ్యకే కేసీఆర్ వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.  త్వరలోనే కేసీఆర్ రహస్య భేటిలు… బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది క్లారిటీ రానుంది.