దోమలు, పాముల భారి నుండి విద్యార్థులను రక్షించండి

  • నాగావళి నది రేవుల వద్ద మర బోట్లు ఏర్పాటు చేయండి
  • వసతి గృహాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించండి
  • నదులు, గెడ్డలు ఆవల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర, నిత్యవసరాలు సరిపడా అందుబాటులో ఉంచాలి
  • జిల్లాలో దోమల నివారణకు పారిశుధ్య పనులు చేపట్టండి
  • ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: దోమలు, పాములు భారి నుండి విద్యార్థులను రక్షించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ ను జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు కలిసి జిల్లాలో దోమలు, పాములు కుట్టటం వలన విద్యార్థుల మరణాలు జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగాలు సీజన్ ఆరంభమైందో లేదో విద్యార్థుల మృత్యువాత ఘంటికలు మోగడం ప్రారంభించామన్నారు. ఈ ఆట దోమలు, పాములు కరిచి కుట్టి పలువురు చిన్నారులు మృత్యువాత పడుతున్నారన్నారు. దోమలు, పాములు కుట్టకుండా ఆయా వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలో తగు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన మంచి నీటిని అందజేయాలన్నారు. అలాగే వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. నాగావళి నదికి సంబంధించి కొట్టు- కొమరాడ, దుగ్గి- నిమ్మలపాడు, పూర్ణ పాడు- లాభేసు, కూనేరు- రెబ్బ తదితర ప్రాంతాల్లోని రేవుల్లో మరబోట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో 2006లో ఇచ్చిన మరుబోట్లు నిర్వహణ లోపంతో మూలకు చేరాయన్నారు. రెబ్బ ప్రాంతంలో గతంలో నాటు పడవ మునిగి 36మంది వరకు మృత్యువాత పడ్డారన్నారు. అందుకే మర బోటు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నదులు, గెడ్డలు తదితర నీటి ప్రవాహాల ఆవల ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు వర్షాకాలంలో వాటి ఉధృతికి బాహ్య ప్రపంచానికి రాలేరని, అటువంటి వారికి ముందుగానే అత్యవసర మందులు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో దోమల నివారణకు పారిశుద్ధ్య పనులు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. దీనికి సమాధానంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు.