ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని ఎద్దుల బండ్లతో నిరసన

  • జనసేన రాష్ట్ర మహిళా చైర్మన్ జె రేఖ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో వద్ద ఎద్దుల బండ్లతో ఆందోళన
  • అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రాన్ని అందజేసిన జనసేన

కర్నూలు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డీజిల్ సెస్ పేరుతో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం కర్నూలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జనసైనికులు మరియు వీరమహిళలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్టీసీ డిపో వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు….జగన్ రెడ్డి బాదుడు…. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్ జె రేఖ గౌడ్ మరియు నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే… బాదుడు అంటూ శోకాలు తీసేవారని, ఇప్పుడు ఆయన బాదుతున్న బస్ ఛార్జీల బాదుడు ఏంటని ప్రశ్నించారు. పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ చార్జీలు పెంచి వారిపై భారం వేయడం సరికాదన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఏసి బస్సులలో 2, 5, 10 రూపాయల చొప్పున పెంచి ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుదలతో పాటు కరెంటు, డీజిల్, పెట్రో ధరలు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్ కుమార్, మౌలాలి, శివ రాఘవ, చిరంజీవి, షబ్బీర్, మునిస్వామి, రజిని, లలిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.