ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించండి

  • జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 24వ డివిజన్లో ఉన్న ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు, పాలకులు ఆ ప్రాంతంపై దృష్టి పెట్టి మౌలిక వసతులు కల్పించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఇందిరమ్మ కాలనీలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీలో సుమారు 3వేల పైచిలుకు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. అక్కడ కనీసం వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి ఇంట్లో డ్రైనేజీ నీరు పోయే దారి లేక రోడ్లమీదకు వదిలేస్తున్నారన్నారు. దీంతో దోమలు విజృంభించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర కార్యదర్శి షేక్ ఆలియా, డివిజన్ ఇంచార్జ్ సౌమ్య, నాయకులు రేవంత్, సాయి, ప్రవీణ్, కిషోర్, మంజులమ్మ, తదితరులు పాల్గొన్నారు.