వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సీఎం ధర్నా

విపక్షాల వ్యతిరేకత మధ్య ఉభయ సభల్లో ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర  వేశారు. సెప్టెంబర్‌ 20న పార్లమెంట్‌ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించారు.

ఇక ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్‌ బంద్‌ చేపట్టాయి. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ధర్నాలో పాల్గొన్నారు. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఖాట్కర్ కలాన్‌లోని షాహీద్ భగత్ సింగ్ నగర్‌లోని విగ్రహానికి సోమవారం ఉదయం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ధర్నా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పారు. న్యాయ, వ్యవసాయ నిఫుణులను సంప్రదించి రాష్ట్ర రైతు చట్టాలను ఆ మేరకు సవరణ చేస్తామని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్‌లో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొంటారని సమాచారం. అనంతరం ఆయన హర్యానాకు వెళ్లి అక్కడి రైతులతో కలిసి నిరసన తెలుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు నెలలపాటు ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చింది. అలాగే ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాలు సేకరిస్తున్నది.