తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్

గుంటూరు, తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని దశాబ్దాలుగా అందని ద్రాక్షాల ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఆస్కార్ అవార్డ్ ని తీసుకురావడంలో కీలకపాత్ర వహించి తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా వినుతికెక్కారని రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని శ్రీనివాసరావుతోటలోని పీర్లచావిడి సెంటర్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ 22 వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆళ్ళ హరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు సినీ ప్రపంచంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులను సైతం రామ్ చరణ్ తిరగరాసారని కొనియాడారు. చిరంజీవి నుంచి కేవలం నటనా వైభవాన్ని మాత్రమే కాకుండా సేవా నిరతిని, మానవత్వాన్ని పునికిపుపుచ్చుకొని ఎన్నో గుప్తదానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగే క్రమంలో రామ్ చరణ్ తనని తాను మలుచుకున్న తీరు నేటి యువత స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఎంత ఎత్తుకి ఎదిగినా వినయ విధేయతతో ఒదిగి ఉండటం రామ్ చరణ్ సాధిస్తున్న విజయాల్లో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ఇక నటనలో రామ్ చరణ్ చూపిస్తున్న వైవిధ్యం నభూతో నభవిష్యత్ అన్నారు. రానున్న రోజుల్లో సినీపరిశ్రమకు రామ్ చరణ్ మరిన్ని విజయాలు అందించాలని ఆళ్ళ హరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, బుడంపాడు కోటి, రామిశెట్టి శ్రీనివాస్, శెట్టి శ్రీను, నండూరి స్వామి, దాసరి రాము, మున్నా, సుభాష్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.