ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించండి

  • అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోండి
  • జనసేన పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్

కంచికచర్ల: విద్యా బోధన బృహత్తర బాధ్యత అని, విద్య వ్యాపార వస్తువు కాదని జనసేన పార్టీ కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయని సతీష్ పేర్కొన్నారు. ప్రైవేటు మరియు కార్పొరేటర్ పాఠశాలల యజమానులు విద్యను వ్యాపార ముడి సరుకుగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని నాయన సతీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు సోమవారం మండల రెవిన్యూ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ వాటి గురించి పట్టించుకోపోవడం పట్ల ప్రయివేటుకు కొమ్ముకాస్తున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. విద్య మార్కెట్‌ సరుకుగా మారిన నేపథ్యంలో తల్లిదండ్రుల ఆశలను, ఆకాంక్షలను సొమ్ము చేసుకునేందుకు ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు కాన్సెప్ట్‌, టెక్నో, ఇ-టెక్నో, డిజిటల్‌, విజువల్‌ వంటి పదాల మాటున దోపిడీకి గేటులెత్తడం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకమునుపే కొన్ని పాఠశాలలలో అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫాం పేరుతో రూ.కోట్లలో వ్యాపారాల్ని సాగిస్తున్నాయని విమర్శించారు. పాఠ్య పుస్తకాలను ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో విక్రయాలు చేయకూడదని నిబంధనలు చెబుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని నర్సరీ, యుకెజి, ఎల్‌కెజి నుంచి ఐదో తరగతి వరకు రూ.10 వేల నుంచి 15 వేలు, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.17 వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తుండటం విస్మయాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫాం, టై, బెల్ట్‌, షూస్‌ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బహిరంగంగా అక్రమ వ్యాపారం సాగిపోతున్నా విద్యాశాఖ యంత్రాంగం నిద్రమత్తులో జోగుతుండడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల లాబీయింగ్‌కు, ప్రలోభాలకు వెరసి ప్రయివేటు పాఠశాలలు, వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో విద్యాశాఖ ఉందని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై ఆదాయ పన్నుల శాఖ ఎందుకు దృష్టిసారించడం లేదో అర్థం కావడం లేదనే విమర్శించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి దోపిడీకి గురవుతున్న తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తోట ఓంకార్, పుప్పాల వేణుగోపాల్, కుసునూరు నరసింహారావు, పెద్దినీడి హరిబాబు, దేవిరెడ్డి అజయ్ బాబు, బత్తిన ఇమ్మానుయేలు తదితరులు పాల్గొన్నారు.