మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్.. ఘాటుగా స్పందించిన కేటీఆర్!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే. ఈ సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి కబ్జాకోరుగా అభివర్ణించగా… ఘాటుగా స్పందించిన మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని.. దమ్ముంటే రాజీనామా చేయాలని తొడగొట్టి ఛాలెంజ్ చేశారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని వాళ్లు ఇవాళ సవాళ్లు విసురుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మా మల్లారెడ్డికి జోష్ ఎక్కువని, అందుకే ఆవేశంలో అలా మాట్లాడారని చెప్పారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడినందుకే కొడంగల్ నుంచి జనాలు తరిమేశారని… చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మల్కాజిగిరిలో గెలిచాడంటూ రేవంత్ ను ఉద్దేశించి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ఫ్రాంచైజీ మాదిరి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చిలక మనదే అయినా… మాట్లాడిస్తున్నది మాత్రం చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు ఆడిస్తున్న తోలుబొమ్మలాటలో రేవంత్ ఒక బొమ్మ అని కేటీఆర్ అన్నారు. బాబు బినామీ అయిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడారు కాబట్టే తాము కూడా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

ఇక, ఏం చేశారని ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. గుజరాత్ కు వరదలు వస్తే  రూ. వెయ్యి కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం… తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని చెపుతారా? అని ఎద్దేవా చేశారు. తాము డబుల్ బెడ్రూమ్ లు కడతామంటే నాలుగైదు ఎకరాలు కూడా ఇవ్వని కేంద్రం… రైల్వే ఆస్తులను మాత్రం అమ్మకానికి పెట్టిందని విమర్శించారు.