మాతృత్వ వందనం.. వైసీపీ మంగళం!

* ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు డబ్బు చెల్లింపు ఏదీ?
* కేంద్ర నిధులకు రాష్ట్ర వాటా ఇవ్వని ప్రభుత్వం
* ఆకులు కాలాక కళ్లు తెరిచిన సర్కారు
* భారీగా లబ్ధి సొమ్ము రాకపై అగమ్యగోచరం

ప్రతి నెలా బటన్లు నొక్కుతున్నానని ఢాంబికాలు పలికే ముఖ్యమంత్రి అత్యుత్తమ కేంద్ర పథకాలకు మోకాలడ్డుతూ… క్షేత్రస్థాయిలో అసలుకే ఎసరు తెస్తున్నారు. కేంద్ర పథకాలకు మంగళం పాడుతున్నారు. కేంద్రం అందించే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక… ఆ డబ్బులను తీసుకొచ్చే దారి లేక లబ్ధిదారులకు సాంత్వన చేకూర్చడం లేదు. పేద బాలింతలకు సాయం అందడం లేదు.
* ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యే పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృత్వ యోజన పథకాన్ని అందిస్తోంది. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన పేద మహిళకు మూడు విడతలుగా రూ.5 వేలను అందిస్తుంది. ఇది వారి ప్రసవానంతర ఖర్చులకు, పోషకాహారానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడుతందనేది పథకం లక్ష్యం. దీనివల్ల పుట్టిన పిల్లలకు సమృద్ధిగా తల్లి పాలు అందుతాయనేది ఆలోచన. ఇది ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ దేశ వ్యాప్తంగా అమలు జరుగుతోన్న పథకం.
* పీఎంఎంవీవై పథకానికి సంబంధించి ఏడాదికి ఆ రాష్ట్ర పరిధిలోని ప్రసవాల ఆధారంగా చెల్లించాల్సిన సొమ్ములో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల మందికి ఇవ్వాల్సిన నిధులు ఆగిపోయాయి. దానికి సంబంధించి కేంద్రం నిధులకు రాష్ట్ర నిధులు జత చేసి ఇవ్వకపోవడంతో మొత్తం నిధులు ఆగిపోయాయి. భవిష్యత్తు నిధులు విడుదల చేయాలంటే కచ్చితంగా పాత నిధులు ఇచ్చి వాటిని క్లియర్ చేయాలని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో మొత్తం పథకం అమలే అస్తవ్యస్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* 2016 లో తల్లిబిడ్డ సంరక్షణ నిమిత్తం కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే దీనికి రాష్ట్రంలో 2019-20ల మధ్య నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. కేంద్రం నిధులకు తగినట్లుగా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలని చెప్పింది. 2019-20లో పెండింగ్ ఉన్న ఆ ఏడాది మూడు త్రైమాసికాల మొత్తం ఒకేసారి రూ.101.25 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.67 కోట్లను విడుదల చేయలేదు. కాస్త డబ్బును జత చేసింది తప్పితే మొత్తం డబ్బును రాష్ట్రం విడుదల చేయలేదు. కేంద్రం సైతం పలుమార్లు అడిగినా స్పందన లేదు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరాల సొమ్ములు పూర్తిగా ఆగిపోయాయి.
* పాత పెండింగ్ ను పట్టించుకోకుండా 2021-22కి సంబంధించి మొదటి త్రైమాసికంలో కేంద్రం నిధులు రూ.14 కోట్లు విడుదల చేసింది. అంటే దీనికి మ్యాచింగ్ గ్రాంటుగా రూ.9 కోట్లను రాష్ట్రం జత చేయాలి. దీంతో రాష్ట్రం ఇవ్వాల్సిన మొత్తం రూ.70 కోట్లకు చేరింది. (మధ్య మధ్యలో కాస్త జమ చేసింది) దీంతో కేంద్రం వెంటనే పాత సొమ్ములు క్లియర్ చేయాలని రాష్ట్రం మీద ఒత్తిడి తేవడం ప్రారంభించింది. పాత మూడు త్రైమాసికాల డబ్బులను రాష్ట్రం విడుదల చేస్తే గాని, తర్వాత మిగిలిన సొమ్ములను విడుదల చేసేది లేదని చెప్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనల ప్రకారం మొత్తం రాష్ట్రంలో 1.91 లక్షల మందికి పథకం అందుతుందని భావించారు. అయితే వారందరికీ ప్రయోజనం చేకూరలేదు.
* 2022 మార్చి చివర్లో ఆలస్యంగా కళ్లు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.70 కోట్లను చెల్లించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లబ్ధిదారులకు సరైన పద్ధతిలో, క్రమానుగుణంగా లబ్ధి అందలేదు. అప్పటికే పెండింగ్ లో ఉన్న డబ్బులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు. కేవలం ప్రభుత్వం డబ్బు చెల్లించిన ఆ త్రైమాసికానికి సంబంధించిన రూ.5 కోట్ల కేంద్రం నిధులు మాత్రమే విడుదల చేసింది. దీంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల పెండింగ్ మొత్తం సొమ్ములు అందలేదు.
* 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రం ఈ పథకంలో భాగంగా రూ. 85 కోట్లు సొమ్ము నష్టపోయిందని అంచనా. 2019-20 సంవత్సరంలో రూ.37.75 కోట్లు, అలాగే 2020-21 సంవత్సరంలో రూ.38.80 కోట్ల సొమ్ము రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక సొమ్ములో రూ.14 కోట్లు విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనించిన కేంద్రం… మొత్తం చెల్లించిన తర్వాతే అసలు నిధులు ఇస్తానంటూ ఇప్పుడు చెబుతోంది. దీంతో రాష్ట్ర అధికారులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
* ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం వరకు వచ్చినా దీనిపై పూర్తిస్థాయి సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వడం గాని, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పడం గాని చేయకపోవడంతో మొత్తం పథకం ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతోంది.