Araku: కాఫీ వ్యాపారుల్ని ఆదుకోండి

అరకు కాఫీ వ్యాపారుల్ని ఆదుకోండి

జనసేన నాయకుల డిమాండ్

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రా ఊటీ అరకుకు పర్యాటకుల రాక తగ్గిందనీ, దీంతో కాఫీ గింజలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రీ సాయిబాబ స్పష్టం చేశారు. గురువారం అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలంలో కాఫీ వ్యాపారులతో ముచ్చటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారాలు లేక పూట గడవని స్థితిలో వారు పడుతున్న ఇబ్బందులు ఈ సందర్భంగా జనసేన నాయకుల దృష్టికి వచ్చాయి. గిరిజన ప్రాంతంలో పర్యాటకం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు కష్టకాలంలో అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ఈ సందర్భంగా శ్రీ సాయి బాబ అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు రహదారులు పూర్తిగా దెబ్బతినడం వల్ల టూరిస్టుల రాక తగ్గిపోయిందని ఆరోపించారు. కాఫీ వ్యాపారం చేసే గిరిజనాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.