చీకటి జీవోతో ప్రతిపక్షాల గొంతు నొక్కడం అవివేకం: కొండిశెట్టి ప్రవీణ్

నార్పల: ప్రజా సమస్యలు వెలుగెత్తి చాటడానికి ప్రదర్శనలు, సభలు, సమావేశాలు వేదికలుగా నిలుస్తాయని వాటిని నిషేదిస్తూ ప్రభుత్వం కక్ష పూరితంగా ప్రవేశపెట్టిన జీవో 1ను వెంటనే రద్దు చేయాలని జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలోని జీవోలను తిరగతోడి రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్వేచ్ఛ, స్వతంత్రాన్ని హరించేలా జీవో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇలాంటి జీవో తీసుకొచ్చి ఉంటే ఆయన పాదయాత్ర చేసేవారా, అధికారంలోకి వచ్చేవారా?.. అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి తన ముఖ్యమంత్రి పీఠం పోతుందనే భయం పుట్టుకొచ్చిందని, అందుకే ప్రశ్నించే గొంతులు నొక్కడానికి చీకటి జీవోను తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.