జగన్‌రెడ్డి విలువలు గురించి మాట్లాడడం సిగ్గుచేటు: గురాన అయ్యలు

విజయనగరం, తండ్రి శవం వద్ద సంతకాల సేకరణ చేసిన జగన్‌ రెడ్డి రాజకీయ విలువలు గురించి మాట్లాడడం సిగ్గుచేటని జనసేన నేత గురనా అయ్యలు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా దీవెన సభలో పవన్‌ కళ్యాణ్‌పై సంస్కారం లేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతీ సభలో పవన్‌ కళ్యాణ్‌ పెళ్లిల్లు గురించి మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. తన కుటుంబంలో చెల్లి, బాబాయి, తాత, ముత్తాతలకు జరిగిన పెళ్లిళ్ల గురించి జగన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన కష్టార్జితంతో పార్టీని నడుపుతూ నిస్వార్ధంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు. జగన్‌రెడ్డిలా ఎవరో పెట్టిన పార్టీని బలవంతంగా లాక్కోలేదన్నారు. జనసేన పార్టీ పొత్తుల గురించి జగన్‌రెడ్డికి అనవసరమన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. జనసేన, టీడీపీ పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు. రానున్న రాజకీయ సునామీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆనవాలు లేకుండా కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఓటమి భయంతో జగన్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సభాపతిగా చేసిన తమ నేత నాదెండ్ల మనోహర్‌ వద్ద విలువలతో కూడిన రాజకీయాలు గురించి వైకాపా నాయకులు ట్యూషన్‌ పెట్టించుకోవాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆయన దగ్గర నేర్చుకోవాలన్నారు. జగన్‌ రెడ్డి అరాచకాలు, అన్యాయాలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. 2024లో జగన్‌రెడ్డిని గద్దె దించేందుకు అన్ని సామాజిక వర్గాలు రెడీగా ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్లా కాదన్నారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హుందాగా నడుచుకోవాలని, జనసైనికుల సహనానికి పరీక్ష పెట్టవద్దని హితవుపలికారు.